జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద, అతను ఇచ్చిన సమాచారంతో రూ.10 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ద్విచక్రవాహనాల చోరీలను అరికట్టేందుకు జగ్గయ్యపేట పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని తెలిపారు. పట్టణంలో ఏర్పాటుచేసిన 443 సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి కదలికలను సీసీ కెమెరా పుటేజీ ద్వారా గుర్తించి, పక్కా సమాచారంతో బీ–కన్వెన్షన్ సమీపంలో నిందితు డిని అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. నిందితుడిని పెనుగంచిప్రోలో మండలం ముళ్లపాడు గ్రామానికి చెందిన సంగా రాము గుర్తించామన్నారు. జగ్గయ్యపేట, మైలవరం, తెలంగాణ రాష్ట్రం మధిర పోలీస్‌స్టేషన్లలో రాముపై కేసులు ఉన్నాయని తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. నిందితుడి వద్ద, అతను ఇచ్చిన సమాచా రంతో రూ.10 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ పి.వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్‌ఐ జి.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


