వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
గుణదల(విజయవాడ తూర్పు): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. నగరంలోని ఎల్‌ఐసీ కాలనీ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ జెండా దిమ్మను కూటమి నేతలు గురువారం ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతు న్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ పైపులైను మరమ్మతులలో భాగంగా జెండా దిమ్మెను తొలగించినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి నేతలు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ కుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవుపలికారు. జెండా దిమ్మెను కూల్చి వేసిన నిందితులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు తుళ్లూరి ఉదయ్, చిత్రం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


