మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని తొమ్మిది మండలాల్లో వలస వెళ్లిన తల్లిదండ్రుల పిల్లల కోసం సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు అనుమతులు మంజూరైనట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి నిర్వహణకు అనుబంధ శాఖలైన గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖలతోపాటు స్వయం సహాయక సంఘాలు, రిజిస్టర్ కాబడిన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు తమ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమతితో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుబంధ శాఖల వారు రాతపూర్వక దరఖాస్తును rrakrirhna@yahoo.co.in మెయిల్ లేదా లేఖ రూపంలో సమర్పించవచ్చని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి, కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆయా సంస్థలు గత మూడేళ్ల ఆడిట్ కాపీలు, సంస్థ బైలాస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, దర్పణ్ ఐడీ తదితర పత్రాలను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ 8106653305ను సంప్రదించాలని కుముదినిసింగ్ తెలిపారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో మునిగి గుర్తు తెలియని బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. దుర్గాఘాట్ వద్ద బాలుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు ఎనిమిదేళ్ల వయసు ఉండే బాలుడు, టీ షర్ట్, చెప్పులు ఒడ్డున కనిపించాయి. స్థానికులు ఇద్దరు పిల్లలు వచ్చి స్నానానికి దిగారని చెబుతున్నారు. బాలుడు మృతి చెందటం చూసి, అతడితో వచ్చిన మరో బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దుర్గగుడిలో నూతనంగా నిర్మించిన అన్న ప్రసాద సదనం, మహా ప్రసాద భవనాల ప్రారంభోత్సవం ఈనెల 21న ఉదయం 11.32 గంటలకు జరుగుతుందని ఆలయ ఈవో శీనానాయక్, ఛైర్మన్ రాధాకృష్ణలు పేర్కొన్నారు. రూ. 52.50 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ రెండు భవనాలతో భక్తులకు మరింత మెరుగైన భోజన వసతి, ప్రసాదాలను పొందే అవకాశం ఉందన్నారు. అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాద భవనాల ప్రారంభోత్సవానికి రావల్సిందిగా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, లోకేష్‌లతో పాటు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌ను ఈవో, ఛైర్మన్లు బుధవారం కలిసి ఆహ్వాన పత్రికలను అందచేశారు.


