బల్లిపర్రులో రూ.15 లక్షలతో మైక్రోఫిల్టర్ ఏర్పాటు ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా మే 24న ఘనంగా ప్రారంభం అప్పటి నుంచీ షెడ్డుకు తాళం
చెరువులో పూర్తి స్థాయి నీరు లేకే..:
పెడన: మండల పరిధిలోని బల్లిపర్రు గ్రామస్తుల తాగునీటి సమస్య తీరుస్తామంటూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌లు మైక్రోఫిల్టర్ ద్వారా తాగునీరు అందించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సీఎస్‌ఆర్ పవర్ గ్రిడ్ నిధులు రూ.15 లక్షలో ఎంతో ఆర్భాటంగా మైక్రోఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే 24న ఘనంగా ప్రారంభించారు. ప్రారంభం రోజు ఎంతో హంగామీ చేసి తాగునీరు ఇప్పించేస్తున్నామని గ్రామస్థుల్ని బలంగా నమ్మించారు. కానీ, ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ మైక్రోఫిల్టర్ షెడ్డుకు తాళం వేసే ఉంచుతున్నారు. దీని ద్వారా తమకు తాగునీరు ఎప్పుడు ఇస్తారా అంటూ గ్రామస్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రొయ్యల చెరువులకు జలకళ..
గ్రామంలో సుమారు 600కు పైగా కుటుంబాలున్నాయి. పాతబల్లిపర్రు, బల్లిపర్రు గ్రామాలకు గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పీడబ్ల్యూటీ స్కీం ద్వారా నీరందిస్తున్నారు. ఈ స్కీంకు సంబంధించిన ఫిల్టర్‌బెడ్‌లు మూతపడటంతో చెరువులోని నీరు నేరుగా ట్యాంకుకు వెళ్లి, తిరిగి అదేనీరు పబ్లిక్ కొళాయిలు ద్వారా, సొంత పైపుల ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. దీంతో ఆ నీటిని వాడకానికి తప్ప తాగేందుకు, వంటలకు వినియోగించడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ, ఎమ్మెల్యే మైక్రోఫిల్టర్ ఏర్పాటు చేశారు. రెండు నెలలు గడిచినా తాగునీరు అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క చేపలు, రొయ్యల చెరువులు నీటితో కళకళలాడుతుంటే పంచాయతీ చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయనడం విడ్డూరంగా ఉంటుందని గ్రామస్థులు మండిపడుతున్నారు.
మైక్రోఫిల్టర్‌కు నీరందించడానికి చెరువు నుంచే నీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ చెరువులో నీరు పూర్తిస్థాయిలో లేదు. అడుగుకు చేరడం వల్ల ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నీరు ఫిల్టర్లలోకి వెళ్తే ఫిల్టర్ పాడైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల చెరువులోకి పూర్తిస్థాయిలో నీరు రాగానే మైక్రోఫిల్టర్ ద్వారా తాగునీరందించడానికి చర్యలు తీసుకుంటాం.
ఆర్.హేమప్రకాష్, ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో,బల్లిపర్రు పంచాయతీ


