ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి ఎన్టీఆర్‌ జిల్లా సర్కిల్‌ విద్యుత్‌ అధికారులతో సమీక్ష సమావేశం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్‌ వినియోగదారులు తెలియజేసిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. విజయవాడ నగరంలోని ఎన్టీఆర్‌ జిల్లా విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్క సిబ్బంది పని చేయాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రీబ్యూషన్‌ ట్రాన్స్‌పార్మర్ల పనితీరును నిరంతరాయం పర్యవేక్షిస్తూ సరఫరాలో నాణ్యతను మెరుగుపరచడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. అధిక లోడ్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట లోడ్‌ బ్యాలెన్సింగ్‌, అదనపు సామర్థ్యాల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రధాన మంత్రి సూర్యఘర్‌ – ముప్త్‌ బిజ్లీ యోజన, నూతన విద్యుత్‌సబ్‌స్టేషన్ల నిర్మాణం, ఫీడర్ల బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సులభంగా నూతన విద్యుత్‌ కనెక్షన్‌...

నూతన విద్యుత్‌ కనెక్షన్‌ కోసం వినియోగదారులు ఈ–సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీసీపీడీసీఎల్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ లేదా ఏపీసీపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటి నుంచే సులభంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం గురించి విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ ప్రమాదాల నివారణకు అన్ని రకాల భద్రతా చర్యలను సిబ్బంది కచ్చితంగా తీసుకోవాలని పుల్లారెడ్డి ఆదేశించారు. సమావేశంలో ఏపీసీపీడీసీఎల్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, టెక్నికల్‌ డైరెక్టర్‌ ఆవుల మురళీకృష్ణ, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ టీవీఎస్‌ఎన్‌.మూర్తి, ఎన్టీఆర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీరు యు.హనుమయ్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కొండలరావు, రవిచంద్ర, హరిబాబు, సత్యనారాయణతో పాటుగా అసిస్టెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement