డీఎంహెచ్‌ఓ డాక్టర్ దయాకర్
మచిలీపట్నంఅర్బన్: లెప్టోస్పిరోసిస్ వ్యాధిపై ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.ఎల్. దయాకర్ సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదల సమయంలో వ్యాధి వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, సమర్థవంతమైన నిఘాతో వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి (అవుట్ బ్రేక్) దర్యాప్తు, నియంత్రణ, ప్రతిస్పందనపై పట్టణంలో నిర్వహించిన రెండు రోజుల సిమ్యులేషన్ ఆధారిత శిక్షణా వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నిఘా, ప్రయోగశాల నిర్ధరణ, వ్యాధి వ్యాప్తి దర్యాప్తు, కేసుల నిర్వహణ, పర్యావరణ పరిస్థితుల అంచనా, ప్రమాద సమాచార ప్రసారం, వివిధ శాఖల మధ్య సమన్వయంతో కూడిన ప్రతిస్పందన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వ్యాధి నియంత్రణలో వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, జిల్లా స్థాయిలో సన్నద్ధతను పెంపొందించడం, వ్యాధి వ్యాప్తి సమయంలో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచడం శిక్షణా కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ శిక్షణలో డీఏహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎస్‌ఓ డాక్టర్ సాయికిరణ్, వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పాఠశాల ఆరోగ్య విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ, ఆహార భద్రత, వైద్య విద్య తదితర శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.


