తీరం తరుక్కుపోతోంది! కోడూరు: హంసలదీవి సాగరతీరంలో సముద్ర కోత తీవ్రంగా పెరుగుతోంది. అలలు రోజురోజు కూ ముందు చొచ్చుకురావడంతో తీరం వెంబడి ఉన్న ఇసుకతిన్నెలు భారీగా కోతకు గురవుతున్నాయి. పాలకాయతిప్ప బీచ్ నుంచి పవిత్ర కృష్ణాసాగరసంగమం వరకు సుమారు కిలోమీటర్ల మేర పరిస్థితి తీవ్రంగా ఉంది. అలల ధాటికి సముద్ర రహదారి సైతం సుమారు 15 అడుగుల మేర కొట్టుకుపోయి సముద్రంలో కలిసిసోయింది. దీంతో తీరంలోని పరిస్థితులపై పర్యాటకులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హంసలదీవి తీరంలో సముద్రం క్రమంగా భూభాగం వైపునకు చొచ్చుకు వస్తోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. అలల ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉండడంతో ఇసుక తిన్నెలు కోతకు గురై కరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని, సముద్రం వద్ద పరిస్థితుల కారణంగా రహదారి, పర్యాటకుల సౌకర్యాలు, తీరంలోని నిర్మాణాలకు ముప్పు పొంచి ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సముద్ర అలల ధాటికి సుమారు 50 అడుగుల మేర రహదారి సముద్రంలో కలిసిపోయిందని, ప్రస్తుతం మరోసారి నీరు ముందుకు రావడంతో 15 అడుగులకు పైగా సముద్ర రహదారి కోత ఏర్పడిందని అటవీ అధికారులు చెబుతున్నారు.
పాలకాయతిప్ప బీచ్‌లో కొట్టుకు వచ్చిన నవగ్రహ విగ్రహాలు, శివలింగం, నందీశ్వరుడికి భద్రత కల్పిస్తూ తీరంలోనే ప్రత్యేక ప్లాట్‌ఫాంను నిర్మించారు. వీటిని ప్లాట్‌ఫాంపై ప్రతిష్టించగా, పర్యాటకులు పూజలు చేస్తున్నారు. అయితే సముద్ర నీరు ముందుకు వచ్చి విగ్రహాల ప్లాట్‌ఫాంను తాకాయి. నందీశ్వరుడి కింద భాగంలో ఉన్న ఇసుక మొత్తం కొట్టుకుపోవడంతో పర్యాటకులు ముందు జాగ్రత్తగా విగ్రహం కింద సిమెంట్ రాళ్లను ఏర్పాటు చేశారు. పవిత్ర కృష్ణాసాగరసంగమం వద్ద ప్రతిష్టించిన కృష్ణమ్మ విగ్రహం, పాదాలు చుట్టూ కూడా ఇసుకతిన్నెలు భారీగా కోతకు గురై సముద్ర నీరు వీటి చుట్టూ చేరాయి. పర్యాటకులు సేదతీరేందుకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన పలు పందిళ్లు సైతం అలలకు కొట్టుకుపోయాయి. విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన బల్లలు ఇసుకలో కూరుకుపోయాయి. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో అటవీ అధికారులు తీరంలో చేస్తున్న అభివృద్ధి పనులకు సైతం తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.
హంసలదీవి సాగరతీరంలో ప్రమాద ఘంటికలు
● అలల ధాటికి 15 అడుగుల
మేర కొట్టుకుపోయిన రహదారి
● మూడు కిలోమీటర్ల మేర భారీగా
కోతకు గురైన ఇసుక తిన్నెలు
● కృష్ణమ్మ, నవగ్ర హ విగ్రహాల
చుట్టూ తొలగిపోతున్న ఇసుక
ముందుకొస్తున్న సముద్రం..
కూలిన పందిళ్లు.. ప్రమాదంలో విగ్రహాలు..