● వరుస చోరీలు చేస్తున్న
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్
గూడూరు: మండలం మల్లవోలు శివారు కుమ్మరిపాలెంలోని భక్తాంజనేయ ఆలయంలో స్వామి వారి వెండి ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూలై 28న రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దొంగలు గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామి వారికి చెందిన దాదాపు 3.5కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకుని పోయారు. చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు సోమవారం గూడూరు పోలీస్ స్టేషన్‌లో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి వెదురుపర్తి దుర్గేష్, దుడ్డు జోష్ బాబు గుడిలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. వీరి నుంచి దొంగలించిన సొత్తుతో పాటుగా ద్విచక్రవాహనం, 2సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో గుంటూరు జిల్లా పరిధిలోని ఆలయాలలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. కారంచేడు, అమృతలూరు, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయా స్టేషన్ హౌస్ అధికారులకు వీరు పట్టుబడిన సమాచారం ఇచ్చామని ఆయన చెప్పారు. ముద్దాయిలను మచిలీపట్నం స్పెషల్ మొబైల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్‌ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్, పోలీస్ బృందాన్ని ఆయన అభినందించారు.
ధ్వజ స్తంభానికి తొడుగు వేయడానికి వచ్చి..
మల్లవోలులోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఽఏర్పాటు చేసిన ధ్వజ స్తంబానికి ఇత్తడి తొడుగు వేయడానికి తెనాలి నుంచి కొంతమంది వచ్చారు. వీరిలో వెదురుపర్తి దుర్గేష్ (30) అనే వ్యక్తి కూడా ఉన్నాడు. పని జరుగుతుండగా ఆలయంలో స్వామి వారికి ఉన్న వెండి ఆభరణాలపై అతని కన్ను పడింది. దీంతో తన ప్రాంతానికి చెందిన దుడ్డు జోష్‌బాబుతో కలసి పథకం రచించాడు. 28వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ గుడిలోకి ప్రవేశించి స్వామి వారికి అలంకరించిన వెండి మకరతోరణం, వెండి కిరీటం, వెండి వక్షస్థలం, వెండి శఠగోపం, వెండి ప్లేట్‌తో పాటుగా ఆంజనేయస్వామి ఉత్సవ వెండి విగ్రహాలను తీసుకుని పరారయ్యారు.
ప్రత్యేక బృందాలతో..
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు కేసు దర్యాప్తుకు పెడన సీఐ కె.నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్‌ఐ చల్లపల్లి దివ్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలాలు గుడి నుంచి ఎండకుదురు రోడ్డు వైపునకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో ఆ కోణంలో ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించిన గూడూరు ఎస్‌ఐ చల్లపల్లి దివ్యప్రకాష్ సీసీ కెమెరాల ఫుటేజీతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.


