బొమ్మల కళాకారుల కోసం ఉడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన అధికారులు తెల్లపొనికి బదులు ఇతర జాతుల కలప పంపిణీ పనికిరాని కలపను మేమేం చేసుకోం అంటూ ఎదురు తిరిగిన కళాకారులు త్వరలో తెల్లపొనికి కలప పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరెడ్డి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పర్యావరణ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ అఽధికారులు కొండపల్లి బొమ్మల కాలనీలో ఉడ్‌బ్యాంక్‌ను శనివారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బొమ్మల తయారీ కళాకారులకు ఉడ్ బ్యాంకుల ఏర్పాటులో భాగంగా కొండపల్లిలో సైతం ఉడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ ఉడ్ బ్యాంక్ ద్వారా బొమ్మల తయారీలో ఉపయోగించే తెల్లపొనికి కలప పంపిణీ చేయాల్సి ఉంది. ప్రారంభోత్సవం అనంతరం ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఉడ్ బ్యాంక్‌లో తెల్లపొనికి కలపకు బదులు బూరుగు, పనస, నల్లమద్ది కలప నిల్వ ఉండటంతో బొమ్మల తయారీ కళాకారులు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. దీంతో అటవీ శాఖ అఽధికారులతో కళాకారులు మాటల యుద్ధానికి దిగారు. ఈ కలప బొమ్మల తయారీకి పనికి రావని తేల్చి చెప్పారు. ఎందుకూ పనికి రాని కలప తీసుకుని మేము ఏం చేసుకోవాలని నిలదీశారు. బొమ్మల తయారీకి తేలికపాటిగా ఉండే తెల్లపొనికి కలప కావాలని పట్టుబట్టారు. వివిధ జాతులకు చెందిన ఈ కలప తీసుకుని తాము ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. కళాకారులు ఎదురు తిరగడంతో ఫారెస్ట్ రేంజ్ అఽధికారి శ్రీనివాసరెడ్డి బొమ్మల తయారీ కళాకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. శాంతించిన కళాకారులు బూరుగ, పనస, నల్లమద్ది కలప మాకు వద్దని, తెల్లపొనికి చెక్క అందిస్తే చాలని బొమ్మల తయారీ దారుల నుంచి రాతపూర్వకంగా రాయించు కున్నారు. ప్రస్తుతం ఉన్న కలపను ఉడ్ బ్యాంక్‌లోనే భద్రపర్చారు. తెల్లపొనికి కలప పంపిణీకి త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డెప్యూటీ రేంజర్ అఽఽధికారి రామిరెడ్డి, ఫారెస్ట్ బీట్ అఽధికారులు దుర్గారావు, సుధాకర్, ఆర్ట్స్, క్రాఫ్ట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


