కోనేరుసెంటర్(మచిలీపట్నం): సముద్రంలో పడి ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బందరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచా యతీ శివారు హెచ్.సత్తెనపాలెంనకు చెందిన పల్లేటి రాజు (25) మరో ముగ్గురు మత్స్యకారులతో కలిసి శనివారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. బోటు ఐదు నాటికల్ మైళ్ల దూరం వెళ్లేసరికి సముద్రంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరి గింది. వర్షంతో పాటు అలలు ఎగిసి పడుతుండటంతో మిగిలిన మత్స్యకారులు తమ బోట్లకు లంగర్‌లు వేసి నిలిపేశారు. రాజు ఉన్న బోటుకు లంగర్ వేసే సమయంలో ప్రమాదవశాత్తు అతను సముద్రంలో పడిపోయాడు. బోటుకు రెండో వైపు ఉన్న మిగిలిన మత్స్యకారులు పది నిమిషాల తరువాత రాజు కోసం చూడగా కనిపించలేదు. అమానంతో బోటు మొత్తం వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలల ఉధృతికి సముద్రంలో పడిపోయినట్లు గ్రహించిన తోటి మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుని రాజు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మైరెన్, కోస్టుగార్డు పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టామని రూరల్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు. రాజుకు భార్య, ఐదేళ్ళ కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


