గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళల చాంపియన్‌షిప్ పోటీలు, జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు వెలగపూడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. పురుషులు, మహిళల విభాగాల్లో విజయవాడ జట్లు విజేతగా, మచిలీపట్నం జట్లు రన్నర్స్‌గా నిలిచాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన పురుషులు, మహిళలను ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రతిభవంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సంఘం జిల్లా కార్యదర్శి ఎం. శివశంకర్, కార్యనిర్వాహక కార్యదర్శి మురళీ, ఉపాధ్యక్షులు బీవీ. నరసయ్య, డి. శర్వాణి, సహాయ కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, జి. సుబ్బారావు, రిఫరీ ఎస్. మోహన్‌రావు పాల్గొన్నారు.


