లోకేష్‌.. మా మొర ఆలకించవా! | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. మా మొర ఆలకించవా!

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

లోకేష్‌.. మా మొర ఆలకించవా!

పదేళ్లయినా పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డెక్కిన బాధితులు 2016లో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన చంద్రాల వాసులు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 50 మందికి రూ.1.75 కోట్లు నష్ట పరిహారం అందజేత ఇంకా 84 మందికి సుమారు రూ.4.41కోట్లు పరిహారం అందాలి గతేడాది జూలైలో పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించిన నారా లోకేష్‌ ఏడాది గడిచినా ఒక్క రూపాయి విదల్చని చంద్రబాబు ప్రభుత్వం

పదేళ్లు గడిచినా పరిహారం ఇవ్వరా?

పరిహారం కోసం కాళ్లరిగేలా తిరిగా

చనిపోయినా ఇచ్చేలా లేరు

జి.కొండూరు: ‘‘నారా లోకేష్‌ సారూ... మమ్మల్ని కరుణించండి.. ఒక్కసారి మా ఊరికి రండి.. మాకు పరిహారం ఇచ్చి ఆదుకోండి.. పదేళ్లు గడిచింది.. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి’’ అంటూ మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. నష్ట పరిహారం ఇస్తామంటూ గతేడాది జూలైలో ప్రకటించిన నారా లోకేష్‌, నేటికీ ఆ పరిహారం అందించకపోవడంతో లోకేష్‌ బ్యానర్‌తో బాధితులు నిరసన తెలిపారు. మొత్తం 134 మంది బాధితుల్లో ఈ పదేళ్లలో 16 మంది చనిపోయారు. మృతుల ఫొటోలతో కూడిన బ్యానర్‌ను పట్టుకుని వారి వారసులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

దశాబ్దం గడిచినా...

మైలవరం–నూజివీడు అర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణలో భాగంగా 2016లో మైలవరం మండలం వెల్వడం గ్రామంలో 60 మంది, చంద్రాల గ్రామంలో 74మంది ఇళ్లు కోల్పోయారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లో పరిహారం కోసం బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. ఆ తర్వాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సాంకేతిక సమస్య లేకుండా అన్ని ధ్రువపత్రాలను సమర్పించిన వెల్వడం గ్రామానికి చెందిన 50మంది బాధితులకు 2023 డిసెంబరు 15న రూ.1.75 కోట్ల నష్ట పరిహారాన్ని అందించారు. ఇంకా వెల్వడం గ్రామానికి చెందిన 10మందికి సుమారుగా రూ.95 లక్షలతో పాటు చంద్రాల గ్రామానికి చెందిన 74 మందికి సుమారుగా 3.46 కోట్ల వరకు నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంది.

లోకేష్‌ మాటిచ్చి ఏడాది గడిచినా...

పదేళ్లు గడిచినా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం అందకపోవడంతో గత ఏడాది జూలై 1వ తేదీన వెల్వడం గ్రామంలో నారా లోకేష్‌ ఫొటోతో బాధితులు నిరసన తెలిపారు. దీనిపై జూలై 2వ తేదీన ‘గూడూ పోయే...దారీ కరువాయె’ శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటనపై స్పందించిన నారా లోకేష్‌ బాధితులకు నెల రోజుల్లోగా నష్ట పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆ మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఏడాది గడిచినా ఒక్క బాధితుడికి కూడా నష్ట పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో బాధితులు శుక్రవారం మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపాల్సి వచ్చింది. ఇప్పటికై నా మాకు పరిహారం ఇస్తారా... లేదా ప్రాణం తీసుకోమంటారా అంటూ బాధితుల్లో ఓ వృద్ధ జంట ఆగ్రహం వ్యక్తం చేసింది.

రోడ్డు వెడల్పు చేయాలని నా ఇల్లు కూల్చి వేసి 155 గజాల స్థలాన్ని తీసుకున్నారు. నేను అప్పు చేసి మళ్లీ ఇల్లు కట్టుకున్నాను. పదేళ్లు గడిచినా ఒక్కరూపాయి పరిహారం ఇవ్వలేదు. నాకు భర్త లేడు. అప్పులు ఎలా తీర్చుకోవాలి.

–బొడ్డు లక్ష్మి, చంద్రాల

రోడ్డు విస్తరణలో నా రెండు డాబాలు సగం వరకు పోయాయి. అప్పు చేసి ఇళ్లు బాగు చేసుకున్నాం. నష్ట పరిహారం కోసం నేను తిరగని చోటు లేదు. ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలి.

–పెండెం లక్ష్మీ మాణిక్యం, చంద్రాల

రోడ్డు వెడల్పు చేయాలని పదేళ్ల కింద నా డాబాని సగం కూల్చారు. ఇల్లు బాగు చేసుకోవడానికి అప్పులు చేశాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇళ్లు కోల్పోయిన వాళ్లు ఒక్కొక్కరిగా చనిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం.

–బింగి గోపాలరావు, చంద్రాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement