కోనేరుసెంటర్: ఆగస్టు 15వ తేదీ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ పరిసరాలలో ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం పెంపొందించే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపకులపతి కె.రాంజీ మాట్లాడుతూ మన పరిసరాలు పచ్చదనంతో నిండి ఉన్నప్పుడే స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుబాటులో ఉంటుందన్నారు. మొక్కల్ని నాటడమే కాకుండా అవి పెరిగి పెద్దయ్యే వరకు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వైకే సుందరకృష్ణ, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ మారుతి, ఎన్ ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రావణి, వివిధ కళాశాలల ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంలకు ఎంఈఓల ఆదేశం
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల అధికారిక సర్దుబాటు ప్రక్రియ ప్రారంభానికి ముందే కొందరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారంటూ శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సదరు మండల విద్యాశాఖాధికారులను (ఎంఈఓ) వివరాలు కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉపాధ్యాయులే పరస్పరం సర్దుబాటు చేసుకున్నారని తాళ్లపాలెం పాఠశాల హెచ్‌ఎం తెలిపినట్లు సమాచారం. దీంతో సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంల నుంచి పూర్తి వివరాలను ఎంఈఓలు కోరినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎంల నుంచి వివరాలు అందిన అనంతరం వాటిని పరిశీలించి నివేదిక రూపొందించి జిల్లా విద్యాశాఖాధికారికి (డీఈఓ) సమర్పించనున్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని గురుకుల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఇరువురు అధ్యాపకులను కళాశాల విద్య కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇటీవల బదిలీలలో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులు గురుకుల కళాశాలకు వచ్చారు. అయితే ఇక్కడ వర్క్‌లోడ్ తక్కువగా ఉండటంతో సదరు ఇద్దరినీ వార్డెన్, డెప్యూటీ వార్డెన్‌గా వినియోగిస్తున్నారు. ఇటీవల కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వార్డెన్, డెప్యూటీ వార్డెన్ నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కళాశాల విద్య కమిషనర్ ఆ ఇరువురు అధ్యాపకులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులు పరిశోధన స్టార్టప్‌ల దిశగా ముందుకు సాగాలని ఎన్టీఆర్ జిల్లా ఆర్డీఓ వెన్నెల శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎక్సెల్‌ఆర్ సహకారంతో సస్టైనబుల్ బయో ఇన్నోవేషన్ ఐడియాస్ అక్రాస్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అనే అంశంపై హ్యాక్‌థాన్ జరిగింది. కృష్ణా వర్సిటీ రెక్టార్ ఎం.బసవేశ్వరరావు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.


