తెల్లదొరలపై తిరువూరు సమరభేరి | - | Sakshi
Sakshi News home page

తెల్లదొరలపై తిరువూరు సమరభేరి

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

బ్రిటీష్‌ పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాల్లో పాల్గొన్న నేతలు సభలూ, సమావేశాలతో ప్రజల్లో చైతన్యం రగిలించిన సమరయోధులు ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో చురుకై న పాత్ర వహించిన తిరువూరు నాయకులు

ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు...

తిరువూరు తాలూకా కార్యాలయం ఎదుట నాటి ప్రముఖ న్యాయవాది పీసపాటి లక్ష్మీకాంతం, కోటమర్తి సీతారామయ్య ఖద్దరు దుస్తులు ధరించినందుకు బ్రిటీష్‌ పోలీసులు ఇరువురినీ దుస్తులు ఊడదీసి నడిరోడ్డుమీద అవమానించారు. ఈ విషయాన్ని లండన్‌ హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ సభలో భారత సభ్యులు ప్రశ్నించారు. ఆ విధంగా తిరువూరు పేరు నాడు అంతర్జాతీయంగా మార్మోగింది. మహాత్మాగాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో తిరువూరు వాసులు చురుకై న పాత్ర వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా నాటి ఉద్యమంలో తిరువూరు పాత్రపై ప్రత్యేక కథనం...

తిరువూరు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తిరువూరు తాలూకాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరువూరులో బ్రిటీష్‌ పాలనను వ్యతిరేకిస్తూ సమరయోధులు చేసిన పోరాటానికి గుర్తుగా స్మారక స్థూపం నేటికీ సాక్షీభూతంగా నిలిచి ఉంది. ఉప్పు సత్యా గ్రహం, హోమ్‌రూల్‌ ఆందోళనల్లో తిరువూరు వాసులు చురుకుగా పాల్గొన్నారు. 1920లో గంపలగూడెంలో కోటగిరి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజలు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా సభలు నిర్వహించినందుకు గంపలగూడెంకు చెందిన పేట బాపయ్య, ఆర్లపాడుకు చెందిన ఊటుకూరు సత్యనారాయణరావు, మామునూరు నాగభూషణరావులను, కాంగ్రెస్‌ కార్యకర్తలకు భోజనం పెట్టినందుకు గోసవీడుకు చెందిన నేరెళ్ళ రోశయ్యను, రోలుపడికి చెందిన జక్కేపల్లి నరసింహంను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టుచేసి చిత్రహింసలు పెట్టారు. తాతకుంట్ల శివారు గౌరంపాలెంకు చెందిన ఐదుగురు ముస్లిం యువకులను ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు పంపారు. 1942లో గంపలగూడెంలో పేట బాపయ్య, మురుకుంట్ల వెంకటప్పయ్య జమీందారీ విధానానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జైలుశిక్ష అనుభవించారు.

బ్రిటీష్‌ పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు

1931లో కల్లు దుకాణాల వేలం పాటలను వ్యతిరేకిస్తూ స్వాతంత్య్ర సమరయోధులు కోటగిరి వెంకట కృష్ణారావు, పేట బాపయ్య సారథ్యంలో బ్రిటీష్‌ పాలకులపై సహాయ నిరాకరణ ఉద్యమం ప్రకటించారు. గ్రామాల్లో కల్లు దుకాణాలకు ప్రభుత్వం నిర్వహించిన పాటలను సామూహికంగా బహిష్కరించడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాట పాడిన వారిని తరిమికొట్టారు. పోలీసు వాహనాలకు ఇంధనం పోయకుండా అన్ని గ్రామాల్లో కట్టడి చేశారు. తిరువూరు తాలూకా కార్యాలయం ఎదుట ప్రముఖ న్యాయవాది పీసపాటి లక్ష్మీకాంతం, కోటమర్తి సీతారామయ్య ఖద్దరు దుస్తులు ధరించినందుకు పోలీసులు ఇరువురినీ దుస్తులు ఊడదీసి నడిరోడ్డుమీద అవమానించారు. ఈ విషయాన్ని లండన్‌ హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ సభలో భారత సభ్యులు ప్రశ్నించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మురుకుంట్ల వెంకటప్పయ్య, మారేపల్లి సుబ్బారావు, కటారు వెంకయ్య బ్రిటీష్‌ సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి తిరువూరు–నూజివీడు మార్గంలో టెలిఫోన్‌ తీగెలు తెంచేశారు.

తిరువూరు తాలూకాలోని గంపలగూడెంకు చెందిన ఊటుకూరి రామకృష్ణారావు, ఊటుకూరు లక్ష్మీ నరసింహారావు, వెంకటప్పయ్య, కఠారు రంగనాయకులు, కఠారు గోవిందరావు, కఠారు వీరాస్వామి, కాసులనాటి వెంకటేశ్వర్లు, కోటగిరి పార్థసారధి, కోటగిరి సూర్యప్రకాశరావు, కోటగిరి మంగతాయారమ్మ, చలంశెట్టి సుబ్బయ్య, చారుగుండ్ల సీతారామయ్య, రాఘవరపు వెంకయ్య, సువారపు వెంకయ్య, సంతపురి నారాయణరావు, కోడూరుకు చెందిన అనుమర్లపూడి వెంకట సీతారామారావు, ముష్టికుంట్లకు చెందిన కొండపర్తి కోదండరామయ్య, గద్దె రంగయ్యనాయుడు, తిరువూరుకు చెందిన గంగు సత్యం, వీవీకే సుబ్రహ్మణ్యం, పొట్లూరి రామస్వామి, వేదాంతం శంభుశాస్త్రి, వేదాంతం వెంకట సుబ్రహ్మణ్య శర్మ, సయ్యద్‌ సాలార్‌, సుబ్బయ్య నాయుడు తదితరులు ప్రాణాలకు తెగించి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. నాటి సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం నేటి తరం కనీస కర్తవ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement