గుడివాడరూరల్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ అన్నారు. గుడివాడ పట్టణంలో నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీం, పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో... నో డ్రగ్స్ నినాదంతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఐజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఈగల్ టీం, పోలీసులు పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్ అంటూ ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ప్రజలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఏజీకే స్కూల్, ఏలూరురోడ్డు, నెహ్రూచౌక్ సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి తిరిగి స్టేడియాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఐజీ మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని సమూలంగా నాశనం చేసేందుకు ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం ద్వారా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, వినియోగిస్తున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని ఐజీ కోరారు.
ఉద్యోగులు, విద్యార్థులే బాధితులు..
ఈగల్ ఎస్పీ జి.స్వరూపరాణి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసిన వారిపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద తీవ్రమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రగ్స్ భారిన ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా పడుతున్నారన్నారు. ఉద్యోగాల కోసం మెట్రో నగరాలకు వెళ్లి సింథటిక్ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారన్నారు. మారక ద్రవ్యాల దాడుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులే జైలుకెళ్లిన సందర్భాలున్నాయన్నారు. విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే వారు డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా డ్రగ్స్ బారిన ఇతరులు పడకుండా చూడాలని కోరారు. అనంతరం బ్రహ్మకుమారి సంస్థ సభ్యురాలు శైలజ మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, డీఎస్పీ పాలా శ్రీనివాస్, స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కూటమి నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, దావులూరి సురేంద్రబాబు, గోకరపు సునీల్, నిమ్మగడ్డ సత్యసాయి, కిలారపు రంగ ప్రసాద్, సీఐలు కొండపల్లి శ్రీనివాస్, కె.హనీష్, ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావు, ఈగల్ టీం సీఐ రవీంద్ర, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.


