లబ్బీపేట(విజయవాడతూర్పు): తెల్లకోటు ధరించి రోగులకు వైద్యం చేయాల్సిన జూనియర్ వైద్యులు నల్ల చొక్కాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానని చెప్పే మూడు శాతం ఎందుకు అంటూ నల్లచొక్కాలతో మానవహారంగా ఏర్పడి వినూత్న నిరసన తెలిపారు. తమ స్టైఫండ్ పెంచాలని, బోధనా వైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు చేయవద్దని, నిబంధనలకు విరుద్ధంగా నాన్ మెడికల్ వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలు చేయవద్దంటూ వారు ఐదు రోజులుగా నిరసన, రిలేదీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నల్ల చొక్కాలతో రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
స్టయిపెండ్ అడిగితే బెదిరింపులా?
ప్రభుత్వం తమిళనాడు తరహాలో ఏటా 3 శాతం స్టైఫండ్ పెంచుతామని చెపుతోందని, ఆ విధానాన్ని తాను అంగీకరించబోమని లేదని జూడాలు తేల్చిచె పుతున్నారు. రెండేళ్లకోసారి 15 శాతం స్టైఫండ్ పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమకు స్టైఫండ్ పెంచమని అడిగితే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్‌లు నెరవేరే వరకూ నిరసన విరమించేది లేదని తేల్చి చెపుతున్నారు.
సూపరింటెండెంట్‌కు నోటీసు..
తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఇదే ధోరణిలో వ్యవహరిస్తే సోమవారం నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావులకు శుక్రవారం నోటీసులు అందచేశారు. ఇప్పటి వరకూ సాధారణ సేవలను మాత్రమే జూడాలు బహిష్కరించి, అత్యవసర సేవలైన క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, పీఐసీయూ, లేబర్ రూమ్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జూడా పిలుపునిచ్చింది.


