ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దుర్గగుడి దేవస్థాన ఆధ్వర్యంలో వరుణ జపాలు, యాగాలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు విజయవాడ దుర్గాఘాట్‌లో కృష్ణానది జలాలలో వరుణ అనువాక సహిత కారక పారాయణలు నిర్వహించారు. తొలుత దుర్గగుడి ఈవో శీనానాయక్, ఛైర్మన్ రాధాకృష్ణలు గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయఅర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు నదీ జలాలలో పారాయణలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, ప్రధాన దేవతలకు, వరుణ దేవుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం దేవతా మూర్లుకు పూజలు, మండప దేవతా ఆవాహనలు, మండప పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు.


