మచిలీపట్నంఅర్బన్: వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు నామినీలుగా పనిచేస్తున్న వీఆర్‌ఏలను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అనేకసార్లు వీఆర్‌ఏల సమస్యలను విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుతం వీఆర్‌ఏలకు కేవలం రూ.10,500 మాత్రమే వేతనం అందుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెంకటరత్నం తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, నైట్ వాచ్‌మెన్, చైన్‌మెన్ పోస్టులను వీఆర్‌ఎలతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సంఘం ప్రతినిధులు, సభ్యులు, పలువురు వీఆర్‌ఏలు పాల్గొన్నారు.


