జిల్లా స్థాయి అధికారి తీరుపై విమర్శలు క్రీడా నిధుల వినియోగంపై ఆరోపణలు సమగ్ర విచారణకు క్రీడా వర్గాల డిమాండ్
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికలపై చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం క్రీడా రంగానికి కేటాయిస్తున్న పరిమిత నిధులు సైతం పూర్తిస్థాయిలో సద్వినియోగం కావడం లేదు. విద్యార్థులకు క్రీడల కోసం ప్రభుత్వం అందిస్తున్న క్రీడా సామగ్రిని ప్రైవేటు మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలతో పాటు, క్రీడా సదుపాయాలను వినియోగించుకునేందుకు అద్దెల పేరుతో వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన కృష్ణా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) పనితీరుపై క్రీడా వర్గాల్లో అసం తృప్తి వ్యక్తమవుతోంది. డీఎస్‌ఏలో జిల్లా అధికారి వ్యవహారశైలిపై పలు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా సమగ్ర విచారణ జరగకపోవడంతో వాస్తవాలపై స్పష్టత కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతా తానై..
ఆ అధికారి భర్త కంప్యూటర్ ఆపరేటర్‌గా, కుమార్తె ఒకసారి కోచ్‌గా, మరో సారి డీటీపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన పలువురు సంస్థలో విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వారి నియామకాలు ఏ ప్రాతిపదికన జరిగాయి? విధుల కేటాయింపులకు ఎవరి అనుమతులు ఉన్నాయి? నిబంధనలు ఏమి చెబుతున్నాయి? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ జిల్లా స్థాయి అధికారి హోదాలో విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు నియామక ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలను వెల్లడించాలని క్రీడా వర్గాలు కోరుతున్నాయి.
ఎంపిక పోటీల నిధులపైనా ఆరోపణలు
అమరావతి చాంపియన్‌షిప్ కోసం ప్రస్తుతం నియోజకవర్గ, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. రిజిస్టర్ చేసుకున్న క్రీడాకారులకు రోజుకు రూ.140 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. అయితే ఎంపిక పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కొందరు కోచ్‌లు సొంత నిధులతో చేసుకుని, క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఒకటి, రెండు ఎంపిక కేంద్రాల్లో మాత్రమే కొంత మొత్తాన్ని ఖర్చు చేసి, మిగిలిన నిధుల వినియోగంపై స్పష్టత లేనందున పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమవుతున్నా యనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని క్రీడా వర్గాలు కోరుతున్నాయి.
పిల్లల కడుపుకొట్టి ‘పోషకాహార’ నిధులు స్వాహా
శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం మొత్తం రూ.5,78,860 విడుదల చేసింది. ఇందులో శిక్షణకు వచ్చే ప్రతి విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున (రూ.4 చిక్కీ, రూ.6 ఇతర పౌష్టికాహారం) అందించాలని నిబంధన ఉంది. అయితే ఏ ఒక్క శిబిరంలోనూ పిల్లలకు చిక్కీలు గానీ, పౌష్టికాహారం పంపిణీ చేసిన దాఖలాలు లేవని క్రీడాకారుల తల్లిదండ్రులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. సమ్మర్ క్యాంపుల పేరుతో శిక్షణను మమ అనిపించి ఆ నిధులు సైతం ఆ అధికారి నొక్కేశారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
నిర్వహణ నిధులపై ఆరోపణలు
క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలలో సదుపాయాల నిర్వహణ పేరుతో పెద్ద మొత్తంలో నిధులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వహణ పేరుతో వసూలు చేసిన నగదును ఎక్కడ జమ చేస్తున్నారు? ఏయే పనులకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాస్త వంగా ఆ పనులు జరిగాయా? అనే అంశాలపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని పలువురు కోరుతున్నారు.
సమ్మర్ క్యాంపుల నిధులపైనా..
ఏటా వేసవిలో విద్యార్థుల కోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ వేసవిలో జిల్లాలో 52 ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు అనుమతులు లభించగా 42 శిబిరాలను నిర్వహించినట్లు డీఎస్డీఓ తెలిపారు. అయితే 16 కేంద్రాల్లో 18 రకాల క్రీడలకు మాత్రమే శిక్షణ జరిగింది. నిధులు కేటాయింపు మాత్రం 42 శిబిరాలకు చూపించి క్యాంపులు పూర్తయిన సుమారు రెండు నెలల తర్వాత కొంత మంది కోచ్‌లకు మాత్రమే నిధులు అందించారనే విమర్శలు ఉన్నాయి.
కోచ్‌లు, పీఈటీలు, పీడీలతో
సమన్వయం కరువు
జిల్లాలోని కోచ్‌లు, పీఈటీలు, పీడీలతో ఆ అధికా రికి సఖ్యత లేదనే విమర్శలు ఉన్నాయి. అవినీతి, నిధుల వినియోగం, విధుల కేటాయింపు, కుటుంబ సభ్యుల పాత్ర తదితర అంశాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. క్రీడా నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులు, ఓచర్లు, బ్యాంకు లావాదేవీలు, సమ్మర్ క్యాంపుల ఖర్చులు, సిబ్బంది నియామకాలు, విధుల కేటాయింపులను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. క్రీడాకారుల అభివృద్ధి కోసం కేటాయించిన ప్రజాధనం పారదర్శకంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపి నివేదికను బహిర్గతం చేయాలని క్రీడా వర్గాలు కోరుతున్నాయి.


