మచిలీపట్నంఅర్బన్: టెట్‌లో ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపులు కల్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యా యులు టెట్ పరీక్ష తప్పనిసరి చేయడంతో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) కృష్ణా జిల్లా శాఖ నాయకులు బుధవారం డీఈఓ యు.వి. సుబ్బారావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామకాలకు టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ 2010లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2015లో విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1)కు చేసిన సవరణల నేపథ్యంలో సర్వీసులో కొనసాగేందుకు, ప్రమోషన్ పొందేందుకు కూడా టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. 2010వ సంవత్సరానికి ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లలో చాలామంది దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారేనని, వారిలో పలువురు ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారికి మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రమోషన్ పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అంగీకరించిన నేపథ్యంలో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నా రని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.డి.షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, జిల్లా గౌరవాధ్యక్షుడ జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జె.ప్రసాద రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్దుల్ వహీద్, పి.పాపయ్య, కె. అర్జున్, ఫణి కిరణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


