సొసైటీల్లో అక్రమాలపై చీకటి పడగ విచారణ పేరుతో కాలయాపన సొమ్ము రికవరీలోనూ అశ్రద్ధ కలవపాముల, వీరవల్లి సొసైటీల్లో కొలిక్కిరాని వ్యవహారం
ఉయ్యూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలిచి సేవలు అందించాల్సిన కొన్ని సొసైటీల్లో సిబ్బంది, చైర్మన్‌లు కుమ్మకై ్క అన్నదాత వెన్నువిరుస్తున్నారు. రైతులు దాచుకున్న సొమ్మును అడ్డదారుల్లో కొల్లగొడుతున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. కో ఆపరేటివ్ సొసైటీ ఉన్నతాధికారుల నిర్లిప్తతతో సొసైటీ అక్రమాలపై చీకటి పడగలు కమ్ముకున్నాయి. ఫలితంగా సహకార సంఘాల భద్రత పెనుసవాల్‌గా మారింది.
నత్తనడకన విచారణ
ఉయ్యూరు మండలంలోని కడవకొల్లు శివారు వీరవల్లి మొఖాసా సొసైటీలో నిధుల గోల్‌మాల్‌పై విచారణ కొనసాగుతూ ఉంది. రూ 62.38 లక్షలు అక్రమాలు బయటపడ్డా చర్యలు లేవు. సొసైటీ సీఈఓ హేమ సొమ్ము తిరిగి చెల్లిస్తానని లేఖ ఇవ్వటం, ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం జరిగి రోజులు గడుస్తున్నా రైతులు, డిపాజిట్‌దారుల సొమ్ముపై అధికారులు ఇంత వరకూ లెక్కలు తేల్చలేదు. నిత్యం రైతులు సొసైటీకి వచ్చి తమ డబ్బులు సంగతి తేల్చాలని అడుగుతున్నా దాట వేత ధోరణితో కప్పిపుచ్చుతున్నారు. అక్రమాల బాగోతం చిట్టా పెరుగుతుండటంతో అధికారుల్లో కలవరం నెలకొంది. సొసైటీ విషయంలో అక్రమాలు తేల్చాలని, తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ప్రస్తుత సొసైటీ చైర్మన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కలవపాములలో చర్యలు శూన్యం
కలవపాముల సొసైటీలో దాదాపు కోటి రూపాయల వరకూ అక్రమాలు జరిగినట్లు సమాచారం. మూడునెలల క్రితం సొసైటీ సీఈఓ రోజారమణి అక్రమాలకు పాల్పడ్డారని, పాలకవర్గం ఫిర్యాదుచేయటంతో అధికారులు విచారణ జరిపారు. రూ.85.92 లక్షలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. సీఈఓ రోజారమణిపై సస్పెండ్ వేటు వేశారు. అయితే నెలలు గడుస్తున్నా సొమ్ము రికవరీ జాడ లేదు. అక్కడి రైతులు, డిపాజిట్‌దారులు తమ సొమ్ములు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నా దాటవేతధోరణి కనిపిస్తోంది. ఉన్నతాధికారులు మహాజన సమావేశం నిర్వహించి తీర్మానం చేసి పంపాలని చెప్పటంతోనే సరిపుచ్చారు. మండలంలోని కాటూరు కేడీసీసీ బ్రాంచి పరిధిలోని రెండు సొసైటీల్లో అక్రమాల భాగోతం చోటుచేసుకోవటం గమనార్హం.


