మచిలీపట్నం అర్బన్: క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు శనివారం మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 224 మంది బాలబాలికలు ఉత్సాహంగా ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17, అండర్–23 బాలురు, బాలికల విభాగాల్లో 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఐదు కిలోమీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, జావెలిన్‌త్రో, షాట్‌పుట్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది క్రీడాకారులను అండర్–17, 12 మంది క్రీడాకారులను అండర్–23 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఝాన్సీలక్ష్మి తెలిపారు.


