కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం స్వాతంత్య్ర వేడుకలపై జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల ఏర్పాటుకు రెవెన్యూ, మునిసిపల్, పోలీస్‌శాఖల సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమానికి ఆర్డీవో కె. సాంబశివరావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారని, పరేడ్ గ్రౌండ్‌ను వెంటనే సిద్ధం చేయటంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలీస్‌శాఖ పరేడ్, మార్చ్‌ఫాస్ట్, గార్డ్ ఆఫ్ హానర్ వేడుకల రిహార్సల్స్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ముఖ్య వేదికపై మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారి మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేయాలని, ప్రజాప్రతినిధులు, వీఐపీలు, అధికారులు, ఆహ్వానితులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి ముందుగానే సమాచారం అందించాలన్నారు.
విశిష్ట సేవకులను గుర్తించండి..
జిల్లాలో విశిష్టంగా రాణిస్తున్న సుమారు 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి వారికి జ్ఞాపికలు అందించే అంశాలను పరిశీలించాలని, ఉత్తమ రైతులను కూడా గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గత ఏడాదిలో సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు జిల్లా నుంచి ఎంపికై న యువత కుటుంబాలను గుర్తించి ఈ వేడుకలకు ఆహ్వానించి సత్కరించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతో నిర్వహించాలన్నారు. 30 నిమిషాలకు పరిమితం చేస్తూ ఉత్తమ ప్రదర్శనలు మాత్రమే ఎంపిక చేయాలన్నారు. అలాగే వివిధ శాఖల శకటాలు, ప్రదర్శన స్టాల్స్, ఒకే అంశం పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. వేడుకల్లో పర్యావరణ హితంగా అన్ని పాటించాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతిశాఖకు అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలన్నారు. డీఆర్వో కె. శ్రీధర్‌రెడ్డి, ఏఎస్పీ వీవీ నాయుడు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ ఎస్. పోతురాజు, మెప్మా, డ్వామా, డీఆర్డీఏ పీడీలు సాయిబాబు, ఎన్. శివప్రసాద్, హరిహరనాథ్, డీఈవో యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


