ఘంటసాల: వ్యవసాయానికి అనుబంధంగా అధిక ఆదాయాన్నిచ్చే పుట్టగొడుగుల పెంపకం చేపట్టడం ద్వార మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కేవీకేలో మూడు రోజులపాటు నిర్వహించిన పుట్టగొడుగుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 700కు పైగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించామన్నారు. వారికి మార్కెట్ అవకాశాలు కల్పించి అగ్రి టెక్ ఫార్మా వంటి సంస్థలతో వారిని అనుసంధానం చేశామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బుట్టల ఎగ్జిబిషన్, ఆయుర్వేద ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. జేసీ నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి. సుధారాణి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి జె. జ్వోతి తదితరులు పాల్గొన్నారు.


