ప్రేమ పేరుతో చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య పంచనామాలో పోలీసులు వాస్తవాలు నమోదు చేయలేదు పూర్తి స్థాయి విచారణ చేయాలని మృతురాలి కుటుంబ సభ్యుల డిమాండ్
మచిలీపట్నంఅర్బన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్న అనంతరం పెళ్లికి నిరాకరించడంతో తన సోదరి శైలుకుమారి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు పేరం నాగశంకర్ ఆరోపించారు. శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేసేందుకు మొవ్వ మండలం పెడసనగంటిపాలెం గ్రామం నుంచి మృతురాలు శైలుకుమారి కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా నాగశంకర్ మాట్లాడుతూ.. తన సోదరి శైలుకుమారి ఆత్మహత్యకు పమిడిముక్కల మండలం కూడేరు శివారు నమితలగుంటకు చెందిన గంజాల చరణ్‌గోపి (చింటూ) కారణమని ఆరోపించారు. చరణ్‌గోపి రెండేళ్లుగా తన సోదరిని వెంటపడుతూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని నాగశంకర్ తెలిపారు. ఆమెకు ఇష్టం లేకపోయినా వెంటపడుతూ, పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని ఆమె పేరును పెడతానని బెదిరించి లొంగదీసుకున్నాడని ఆరోపించారు. తనను పెళ్లి చేసుకోవాలని శైలుకుమారి కోరిన సమయంలో చరణ్‌గోపి నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. జూలై 31న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు.
పంచనామాపై కుటుంబ సభ్యుల
అభ్యంతరం..
ఆగస్టు ఒకటిన నిర్వహించిన పంచనామాలో తమ సోదరి మృతికి చరణ్‌గోపితో ఉన్న వ్యవహారమే కారణమని స్పష్టంగా చెప్పినా, పోలీసులు ఆ విషయాలను నమోదు చేయకుండా రక్తహీనత కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రాయాలని ఒత్తిడి తెచ్చారని నాగశంకర్ ఆరోపించారు. పంచనామాకు ముందు ఖాళీ పత్రాలపై తమ సంతకాలు తీసుకున్నారని తెలిపారు. జప్తు చేసిన సెల్ ఫోన్లలోని కాల్ వివరాలు, సంభాషణలను పరిశీలిస్తే చరణ్‌గోపి, శైలుకుమారి మధ్య జరిగిన వ్యవహారానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. చరణ్‌గోపిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.


