● 21న ప్రారంభోత్సవాలు ● అన్ని శాఖల అధికారులతో సమీక్షలో
దుర్గగుడి ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అన్నదానం, లడ్డూపోటులను ఈ నెల 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనున్నాయి. భవనాల ప్రారంభోత్సవానికి సంబంధించి దేవదాయ శాఖ నుంచి అన్ని అనుమతులు రావడంతో సుముహూర్తాన్ని ఖరారు చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నిర్మించిన ఈ రెండు భవానాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దల వైపు నుంచి ఆమోదం తెలపాల్సి ఉండగా, అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూపోటు ప్రారంభోత్సవం నాటికి యంత్రాలు, విద్యుదీకరణ, ప్రసాదాల తయారీ ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలుగకుండా చూడాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రావణ మాసంలో నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏసీ రంగారావు, డీఈవో కిషోర్‌కుమార్, ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈఈలతో పాటు ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


