కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాలిక జారిపడిందంటూ బుకాయించిన పాఠశాల యాజమాన్యం! ఘటనపై తమకు సమాచారం ఇవ్వలేదంటున్న తల్లిదండ్రులు
సత్యనారాయణపురం(విజయవాడపశ్చిమ): పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ మధురానగర్‌లో నివసించే బాలిక (13) సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 8వ తరగతి విద్యార్థి. ఇటీవల చదువులో కొంచెం వెనుకబడిందని, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయంటూ ఉపాధ్యాయులు బాలికను తరగతి గదిలోని విద్యార్థులు ఎదుటే అవమానకరంగా మాట్లాడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి.
మళ్లీ అవమానిస్తారనే ఆందోళనతో..
ఆ పరీక్ష రాసిన బాలిక తక్కువ మార్కులు వస్తాయని ఆవేదనకు గురైంది. మళ్లీ ఉపాధ్యాయులు అవమానిస్తారని భావించింది. జరుగుతున్న విషయాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక చావే శరణ్యమని భావించింది. పాఠశాల నాలుగో అంతస్తులోని టాయిలెట్‌ల వెనుక నుంచి రోడ్డు మీదకు దూకింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు, స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను ఆటోలో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ఆమె కాళ్లు, చేతులు విరిగి, తలకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఉపాధ్యాయులు ఎటువంటి వత్తిడి పెట్టలేదని, బాలిక ప్రమాదవశాత్తు పాఠశాల భవనం నుంచి జారిపడిందని దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం. తన కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాఠశాల యజమాన్యమే కారణం అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం కూడా అందించలేదని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాతే తమకు తెలిసిందని వాపోయారు. దీనిపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


