సాక్షి, విజయవాడ/విజయవాడ లీగల్: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని, విమర్శలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన విజయవాడ కోర్టుకు తనపై నమోదైన పోక్సో కేసు విచారణ నిమిత్తం మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాట్లాడుతూ.. తనపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి వేధిస్తోందన్నారు. నేరస్తులను అరెస్టు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు, లాఠీచార్జీలు, పోలీసు నిర్బంధాలు ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలని స్పష్టం చేశారు.
రైతుకు అన్యాయం చేస్తున్నారు..
ఉరవకొండలో ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలపై లాఠీ చార్జ్, కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ ఖండించారు. మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శీనప్ప భూవివాదంలో తలదూర్చుతున్నారని, కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ బాధిత రైతుకు న్యాయం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణచివేయడం సరికాదని, చట్టాన్ని అమలు చేయడమే ప్రభుత్వ బాధ్యత హితవుపలికారు. ఉరవకొండలో ప్రజలను, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బ్యారికేడ్లతో అడ్డుకోవడం పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందని, బీసీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలను ఈ ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్ సీపీ నేతలపై నమోదైన కేసులు రాజకీయ కక్షసాధింపే అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం మానేసి అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.
పోక్సో కేసులో విజయవాడ కోర్టుకు
హాజరైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్


