పశ్చిమం.. ప్రహసనం | - | Sakshi
Sakshi News home page

పశ్చిమం.. ప్రహసనం

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

పశ్చిమం.. ప్రహసనం టీడీపీకి ప్రాణసంకటం.. జనసేనకు అవకాశం

టీడీపీకి అందని ద్రాక్షగానే..

టీడీపీకి ప్రాణసంకటం.. జనసేనకు అవకాశం

విజయవాడ పశ్చిమలో

తారస్థాయికి ఆధిపత్య పోరు

పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి

బుద్ధా వెంకన్నకు కలసిరాని నేతలు

మరోవైపు పాగా వేసేందుకు

పావులు కదుపుతున్న జనసేన

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పార్టీ ప్రకటించడాన్ని ఇతర నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటి వరకూ పార్టీ పగ్గాలు తమకు దక్కుతాయని ఆశించిన వారు ఈ ప్రకటనతో నిరాశ చెందారు. బుద్ధా వెంకన్నకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరఫున సుజనాచౌదరి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని చిన్ని ఇన్‌చార్జిగా వ్యవహరించారు.

జనసేన కన్ను..

తర్వాత కాలంలో పశ్చిమలో పాగా వేయడం కోసం జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. కొద్ది నెలల క్రితమే జనసేన కార్యాలయం ప్రారంభించింది. అనంతరం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పశ్చిమలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల జనసేన సమావేశం నిర్వహించి విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పట్టుసాధించాలని నిర్ణయించింది. దీంతో తెలుగుదేశం పార్టీ హడావుడిగా బుద్ధా వెంకన్నను పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమించింది. ఈ పరిణామాలు అక్కడి నేతలకు మింగుడుపడటం లేదు.

ఎవరికి వారే..

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న ఎంఎస్‌ బేగ్‌, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేష్‌, ఏపీ దూదేకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా పశ్చిమ ఇన్‌చార్జ్‌ పదవి ఆశిస్తున్నారు. అయితే డూండీ రాకేష్‌కు నారా లోకేష్‌ అండదండలు ఉన్నాయి. కానీ సొంత సామాజకవర్గంలోనే వ్యతిరేకత రావడంతో అతన్ని పక్కన పెట్టారు. మాజీ మంత్రి ఎంకే బేగ్‌ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎంఎస్‌ బేగ్‌ కూడా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవిని ఆశించారు. నాగుల్‌మీరా గతంలో పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అతను పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేశారు. అయితే వీరిని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారిద్దరూ నిరాశ చెందారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూడా తనకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన కూడా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ బుద్ధా వెంకన్నకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. బుద్ధా వెంకన్న ఒక్కరే స్థానిక నేతలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1983లో బీఎస్‌ జయరాజ్‌ తప్ప మరెప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపొందలేదు. బీజేపీ ఒక్కసారి గెలిచింది. దీంతో ఈ నియోజకవర్గంలో పట్టు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అంతర్గత కలహాలతో అడుగు ముందుకు పడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement