ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారెను సమర్పించారు. మంగళవారం దేవస్థాన శానిటేషన్ సిబ్బంది, కేశఖండనశాల సిబ్బంది సారెను సమర్పించారు.
నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో...
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన కేశఖండనశాల నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి సారెను సమర్పించారు. దుర్గాఘాట్ ఎదుట ఉన్న కేశఖండనశాలలో అమ్మవారి చిత్రపటానికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులతోపాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకోగా ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారె సమర్పించారు. కార్యక్రమంలో నాయీబ్రహ్మణ సంఘం ఏపీ జేఎసీ అధ్యక్షులు గుంటుపల్లి రామదాసు దంపతులు, ఏజీఎల్ నారాయణ, ఆర్వీ రమణ, జి.హరికిరణ్, ఏ.పూర్ణ, కనకారావు, పి. సంతోష్, ఏ.రాంబాబు, ఆర్.రమణ తదితరులు పాల్గొన్నారు.
జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపు
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శానిటేషన్ విధులు నిర్వహించే సిబ్బంది మంగళవారం అమ్మవారికి సారెను సమర్పించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో రావిచెట్టు వద్ద అమ్మవారికి ఆలయ చైర్మన్, ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. శానిటేషన్ కార్మికులు కుటుంబసమేతంగా తరలివెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు తిరుమలరావు, ఎన్.రమేష్‌బాబు, చంద్రశేఖర్, ఈఈ రమాదేవి, సూపరిండెంటెంట్ మూర్తి, హేమ, బలరామ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు పోలీసు సారె..
అమ్మవారికి విజయవాడ పోలీసుల తరఫున బుధవారం ఆషాఢ సారెను సమర్పించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు దంపతులతోపాటు పలువురు పోలీసులు, జిల్లాకు చెందిన మహిళా సిబ్బంది సారె సమర్పించనున్నారు.
21వ రోజుకు చేరిన
ఆషాఢ మాసోత్సవాలు
మంగళవారం కూడా
కొనసాగిన సారె రద్దీ
భక్తబృందాలతోపాటు సారె
అందజేసిన ఆలయ సిబ్బంది
ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పెద్ద ఎత్తున భక్తులు సారెను సమర్పించారు. 21వ రోజైన మంగళవారం 39 బృందాలు, సుమారు 17వేల మంది భక్తులు బృందాలుగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. సారె సమర్పించిన భక్త బృందాలకు అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు వారికి ప్రసాదాలను అందించారు.


