తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి అవమానం | - | Sakshi
Sakshi News home page

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి అవమానం

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

ఎ.కొండూరు: తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల నడుమ నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎ.కొండూరు మండలం అట్లప్రగడలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గంటకు పైగా వేచిచూసినా అధికారులు రాలేదు. గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా 790 మంది రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనాలని రెవెన్యూ అధికారులు కోరడంతో ఎమ్మెల్యే మంగళవారం ఇక్కడికి వచ్చారు. ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమ వివరాలు ప్రకటించింది. ఈ మేరకు 150కి పైగా పాస్‌ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేసిన అధికారులు కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. ఎంపీ వర్గీయుల ఒత్తిడి మేరకే అధికారులు ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది.

గంటసేపు ఎదురుచూసి..

అట్లప్రగడలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే గంటసేపు అధికారుల రాక కోసం ఎదురుచూశారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అనుచరులు ఫోన్లో సంప్రదించగా, తహసీల్దార్‌ విజయవాడ వెళ్లారని, డెప్యూటీ తహసీల్దార్‌, వీఆర్వో వస్తారని సమాధానం వచ్చింది. వారు కూడా ఎమ్మెల్యే వెళ్లిపోయే సమయంలో హడావుడిగా వచ్చి ఆయనకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. గ్రామ సచివాలయం వద్ద టెంట్లు వేసి, కుర్చీలు ఏర్పాటు చేసిన అధికారులు కార్యక్రమానికి రాక పోవడం గమనార్హం. కార్యక్రమానికి ఆహ్వానించి అధికారులు గైర్హాజరవడంపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, పాస్‌పుస్తకాలు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. పాస్‌పుస్తకాల కోసం పనులు మానుకుని వచ్చిన రైతులు సైతం నిరాశకు లోనయ్యారు.

వివాదాస్పదమైన అట్లప్రగడలో

పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement