సందడిగా ప్రారంభమైన సప్తసింధు – 2026 ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆలయ నిర్మాణంపై పోటీలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతి, ఆలయ వాస్తు శిల్ప సంపద, ఆధ్యా త్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు యువత కీలక పాత్ర పోషించాలని పలువురు వక్తలు సూచించారు. ఏఈ ఫౌండేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ), విశ్వబంధు ట్రస్ట్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏ) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం విజయవాడ లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ)లో సప్త సింధు–2026 పేరుతో పోటీలను శనివారం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు, అధ్యాపకులు, వాస్తుశిల్పులు, కళాకారులు, పరిశోధకులు, సాంస్కృతిక రంగ నిపుణులు పోటీల్లో పాల్గొన్నారు. ఆలోచనల మేధోమథనం, సృజనాత్మకత, వారసత్వ పరిరక్షణకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే యలమంచిలి సుజనాచౌదరి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ప్రముఖ స్థపతి, యాదాద్రి ఆలయ సలహాదారు డాక్టర్ ఎస్.సుందరరాజన్, శ్రీరామానుజ సహస్రాబ్ది స్టాట్యూ ఆఫ్ ఈక్వాల్టీ ముఖ్య స్థపతి డి.ఎన్.వి.ప్రసాద్ స్థపతి, ఏఈ ఫౌండేషన్ డైరెక్టర్ సంగీత మిశ్రా, ఎస్‌పీఏ (విజయవాడ) డైరెక్టర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ, విశ్వబంధు ట్రస్ట్ ఫౌండర్ యమునా పాఠక్, ఐజీఎన్‌సీఏ రీజనల్ సెంటర్ – తిరుపతి రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.టి.వి.రాఘవన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. అనాదిగా భారతీయ సంస్కృతిలో భాగమైన ఆలయ శిల్ప కళా వైభవాన్ని కాపాడుకోవటం అవసరమన్నారు. ఆ బాధ్యతలను నేటి యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టెంపుల్ డిజైన్, మురల్ ఆర్ట్, పల్లకీ మేకింగ్, రంగోళి, టెంపుల్ ఆర్చ్ డిజైన్ తదితర అంశాల్లో పోటీలను నిర్వహించారు.
ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్
సప్తసింధు – 2026లో భాగంగా విద్యార్థులు, యువత తయారు చేసిన వివిధ ఆలయ నమూనాలు, ప్రదర్శనాంశాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం సాయంత్రం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువ వాస్తుశిల్పులు, అధ్యాపకులు, కళాకారులు, పరిశోధకులు పరస్పర అనుభవాలను పంచుకోవడం ద్వారా కొత్త ఆలోచనలు, సృజనాత్మక దృక్పథాలు వెలుగులోకి వస్తాయన్నారు. వాస్తుశిల్పం, వారసత్వ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల్లో యువత సృజనాత్మకత దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు.


