ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పరిరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన భక్తులు శని వారం రూ.1.15 లక్షల విరాళం సమర్పించారు. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన పలగుమ్మి అఖిల్ విశ్వేస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి వేద పరిరక్షణ కోసం విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. శ్రావణ్‌బాబు మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలు నిర్దేశిత లక్ష్యాల ప్రగతి సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల అమలు, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నవీన్, డీఐఓ డాక్టర్ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడి (మచిలీ పట్నం): రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిం చనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని న్యాయ స్థానాల పరిధిలో ఈ జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందని పేర్కొన్నారు. సివిల్, ఎకై ్సజ్ కేసులు తదితర రకాల కేసులు పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తమ న్యాయవాదులతో లోక్‌అదాలత్‌కు సిఫార్సు చేయించుకోవాని పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతకు విస్తృత అవకాశాలు
ఇబ్రహీంపట్నం: పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రొసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక సాధికారతకు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా–రైజ్, నేటివ్ టేబుల్, ఫిక్కీ, ఎఫ్ఎల్ఓ విజయ వాడ సంస్థల భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం స్వయం సహాయ సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సహజ సిద్ధంగా పండించే ధాన్యాలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయాలు, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధ్దిగా అందించడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతాయని పేర్కొన్నారు. సమృదిగా విటమిన్ డీ, బీ 12తో మరింత పోషకాల గనిగా గుడ్లను మార్చేందుకు నేటివ్ టేబుల్ కృషి చేస్తోందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌కు అందించడం ద్వారా మహిళలు విజయవంతమై పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి. నాంచార రావు, సుమబిందు అట్లూరి (ప్రమాణ్ ఫౌల్టిస్), నేటివ్ టేబుల్ మేనేజింగ్ పార్టనర్ చరిత మూల్పూరి పాల్గొన్నారు.


