ఈ ‘గులాబ్ పురా’ ఎక్కడుంది బాబూ..! ఎన్‌హెచ్–65పై మాత్రం పెద్ద పెద్ద బోర్డులు
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ సమయంలో రోడ్డు వెంబడి గ్రామాలు వాహనదారులకు తెలిసేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతి ఊరు మొదలయ్యే చోట ఆ ఊరిపేరుతో కూడిన సూచికలు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా గూడూరు గ్రామ శివార్లలో మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి వెంబడి గులాబ్‌పురా పేరిట పెద్ద పెద్ద సూచికలు ఏర్పాటు చేశారు. అయితే స్థానికంగా గులాబ్ పురా అనే ఊరు ఇక్కడ లేకపోవడం జాతీయ రహదారిపై ప్రయాణం చేసే ప్రయాణికులు, వాహనదారులను గందరగోళానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల ప్రకారం కూడా గూడూరు పరిసరాల్లో ఈ ఊరిపేరు కనిపించడం లేదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే... రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో ఒక టౌన్ ఉన్నట్లు చూపిస్తుండటం విశేషం. మరి అలాంటి ఊరి పేరును గూడూరు సమీపంలో ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకే ఎరుక. స్థానికులకు కూడా ఈ పేరు ఇక్కడ ఎందుకు పెట్టారబ్బా అంటూ ఎంతగా ఆలోచన చేస్తున్నా... సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.
నరికేడ్లపాలెం సూచిక కూడా అంతే..
ఇదొక్కటే కాదండోయ్ తరకటూరు శివారు పర్ణశాల సమీపంలో కూడా నరికేడ్లపాలెం అంటూ మరో సూచిక ఏర్పాటు చేశారు. వాస్తవానికి నరికేడ్లపాలెం అనే గ్రామం గూడూరు మండలంలోనిదే. కానీ గూడూరు నుంచి పెడన వెళ్లే మార్గంలో ఉంటుంది. కానీ తరకటూరు శివారు పర్ణశాల నుంచి తుమ్మలపాలెం వెళ్లే రోడ్డును నరికేడ్లపాలెం గ్రామానికి సూచికగా అధికారులు ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల ఈ ప్రాంతంలో ఆటో ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోయారు. ఆటోలో ఉన్న మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న వారు 108కు ఫోన్ చేసి ప్రమాద స్థలాన్ని నరికేడ్లపాలెం రోడ్డు దగ్గర అని చెప్పడంతో 108 ఊరంతా తిరిగి ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర గులాబ్‌పురా పేరిట ఏర్పాటు చేసిన సూచిక ; తరకటూరు శివారు పర్ణశాల సమీపంలో నరికేడ్లపాలెం పేరిట ఏర్పాటు చేసిన సూచిక
పట్టించుకోని పాలకులు
బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్... ఇలా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు విజయవాడ వెళ్లాలంటే రెగ్యులర్‌గా ఈ రహదారి మీదే ప్రయాణాలు సాగిస్తుంటారు. గూడూరు, తరకటూరు ప్రాంతాల దగ్గర తప్పుగా ఏర్పాటు చేసిన సూచికలు తొలగించి, సరైన సమాచారంతో ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు స్థానిక ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గతంలో జేసీగా పనిచేసిన మాధవీలత గూడూరులో పర్యటించినప్పుడు స్థానికులు ఈ సమస్యను లిఖిత పూర్వకంగా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ వల్లభనేని బాలశౌరికి కూడా స్థానిక నాయకులు వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి సూచికలు సరిచేయాలని వారు కోరుతున్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడ మధ్యలో చిన్న చిన్న గ్రామాల పేర్లు కూడా పెద్దపెద్ద అక్షరాలతో వాహనదారులకు తెలిసేలా ఏర్పాటు చేసిన జాతీయ ప్రాధికార సంస్థ అధికారులు దాదాపు ఏడు వేల జనాభా కలిగి మండల కేంద్రంగా ఉన్న ‘గూడూరు’ పేరుతో ఎక్కడా సూచిక ఏర్పాటు చేయకపోవడం కొసమెరుపు.
గూగుల్‌లో వెదికినా కనిపించని ఊరు


