మధురానగర్(విజయవాడసెంట్రల్): లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి, 22 మంది విద్యార్థుల బలిదానాలకు కారకుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. సోనమ్ వాంగ్ చుక్ దీక్షను నిరంకుశంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో 89 సార్లు పేపర్ లీక్ లతో విద్యా వ్యవస్థను అత్యంత ఘోరంగా దిగజార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు స్పందించకుండా భగ్నం చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్, సహాయ కార్యదర్శి ఐషిగోష్ ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌కు దేశ యువత, విద్యార్థులు సీజేపీ పిలుపులో భాగంగా దేశ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేపడితే భారీగా పోలీసులను మోహరించి లాఠీచార్జ్ చేయడం, ఇంటర్ నెట్ ఆపేయడం, మెట్రోలను ఆపేయడం చూస్తుంటే యువత పోరాటానికి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. ఇప్పటికై నా తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో యువత, నిరుద్యోగుల్లో అసంతృప్తి పెద్దఎత్తున పెరిగిందన్నారు. నిరసన ర్యాలీ మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రవి, నాయకులు కృష్ణ, శివ, షణ్ముఖ్, ఒజేస్విన్, సోమేశ్వరరావు పాల్గొన్నారు.
చలో పార్లమెంట్ యూత్ మార్చ్‌కు
మద్దతుగా నిరసన ప్రదర్శన


