గుట్టుచప్పుడు కాకుండా.. | - | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా..

Jul 17 2026 7:21 AM | Updated on Jul 17 2026 7:21 AM

చడీచప్పుడూ లేకుండా గృహాలకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు గుట్టుచప్పుడు కాకుండా..

ఆందోళనలో గృహ విద్యుత్‌ వినియోగదారులు నాడు గగ్గోలు పెట్టి.. నేడు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు ఇళ్లకు వచ్చి బిగిస్తున్న వైనం

చడీచప్పుడూ లేకుండా గృహాలకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు

పెనమలూరు: టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లపై గగ్గోలు పెట్టి.. నేడు అధికారంలోకి వచ్చిన తరువాత స్మార్ట్‌ మీటర్లను గృహ వినియోగదారులకు అంటగడుతోంది. ఇంటింటికీ విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో విద్యుత్‌ రీడింగ్‌, బిల్లింగ్‌ పూర్తిగా ప్రైవేటు పరం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యుత్‌ వినియోగదారులకు భవిష్యత్తులో షాక్‌ల మీద షాక్‌లు తగులు తాయని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మార్ట్‌ మీటర్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ ఎలక్ట్రానిక్‌ మీటర్లు(ఐఆర్‌) స్థానంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత కాలం విద్యుత్‌ వినియోగదారులు వారు వినియోగించిన విద్యుత్‌ను విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో మీటర్‌ రీడింగ్‌ తీసి వినియోగదారులకు బిల్లులు ఇచ్చేవారు. వినియోగదారులు ఆన్‌లైన్‌ లేదా విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్లలో బిల్లులు అందిన 15 రోజుల్లో సొమ్ము చెల్లించేవారు.

ప్రజల్లో ఆందోళన..

గృహాలకు స్మార్ట్‌ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్‌ వినియోగం కన్నా రీడింగ్‌ ఎక్కువగా వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్‌ మీటర్లు అమర్చడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎసరు పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు వినియోగించిన విద్యుత్‌ బిల్లు వినియోగదారుడికి వాట్సాప్‌ ద్వారా లేదా మెసేజ్‌ రూపంలో వస్తుంది. భవిష్యత్తులో స్మార్ట్‌ మీటర్లను ప్రీపెయిడ్‌ మీటర్లుగా అమలు చేసే అవకాశం ఉండటంతో ఒక నెల ముందుగానే వినియోగదారులు సొమ్ము అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎక్కువ లోడ్‌ విద్యుత్‌ వాడితే వెంటనే అదనపు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ మీటర్లు వద్దు..

గృహాలకు స్మార్ట్‌ మీటర్లు వద్దని ప్రజలు కోరుతున్నారు. ఈ మీటర్ల వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలను బాగు చేయటానికి, ప్రజలను దోచుకోవటం సరైన చర్య కాదని ఖండిస్తున్నారు. స్మార్ట్‌ మీటర్ల కారణంగా తమపై భారం పడుతుందని, ఇప్పటికే విద్యుత్‌ బిల్లులలో రకరకాల చార్జ్‌లు చూపుతూ ముక్కుపిండి ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కానూరు సెక్షన్‌ పరిధిలో వినియోగదారులకు గుట్టుచప్పుడవ్వకుండా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కానూరు సెక్షన్‌లో దాదాపు 80వేల గృహాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య సంస్థలకు స్మార్ట్‌ మీటర్లు పెట్టారు. గృహాలకు స్మార్ట్‌ మీటర్లు పెట్టడానికి యత్నించగా జనాల నుంచి వ్యతిరేకత రావటంతో ఇంతకాలం ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా గృహాలకు విద్యుత్‌ ఎలక్ట్రానిక్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లు పెడుతున్నారు. ఇళ్లల్లో ఎవ్వరు లేని సమయం చూసి స్మార్ట్‌ మీటర్లు ప్రైవేటు వ్యక్తులు వచ్చి అమర్చి చల్లగా జారుకుంటున్నారు. గృహ యజమానులు వచ్చి చూసేసరికి స్మార్ట్‌ మీటర్లు కనబడుతున్నాయి. అదే ఇంట్లో ఎవరైన ఉంటే అభ్యంతరం తెలిపితే స్మార్ట్‌ మీటర్లు పెట్టడం లేదు. కానీ స్మార్ట్‌ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement