రెండో రోజు కొనసాగిన దుర్గమ్మ సారె సంబరం సారె సమర్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, దేవదాయ శాఖ కమిషనర్లు 26 భక్తబృందాలు, 9వేల మందికి పైగా భక్తుల రాక
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో రెండో రోజైన గురువారం పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు అమ్మవారికి సారెను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు అమ్మవారికి సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సారె ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ దంపతులకు ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధా కృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. మరో వైపు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సైతం గురువారం అమ్మవారికి సారెను సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పట్టుచీర, పూలు, పసుపు, కుంకుమ, పూజా సామగ్రికి సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
తరలివచ్చిన భక్త బృందాలు..
సారెను సమర్పించేందుకు ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు, భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 26కు పైగా భక్త బృందాలలో మొత్తం 9 వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించిన భక్త బృందాలకు భవానీ అనుగ్రహ దర్శన్ క్యూలైన్(100 టికెట్)ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. అనంతరం మహా మండపం రెండో, మొదటి అంతస్తులలో దేవస్థానం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసింది.
వీకెండ్‌లో అంతరాలయ, వీఐపీ దర్శనాలు రద్దు..
శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు అంతరాలయ, వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వీకెండ్ రద్దీకి తోడు ఆషాఢ మాసోత్సవాల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలో టికెట్ల కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు కొండ దిగువన కనకదుర్గనగర్, ఓం టర్నింగ్ పాయింట్, ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం, మహామండపం దిగువన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


