దుర్గమ్మ సేవలో హీరో అల్లరి నరేష్‌ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో హీరో అల్లరి నరేష్‌

Jul 17 2026 7:21 AM | Updated on Jul 17 2026 7:21 AM

దుర్గమ్మ సేవలో హీరో అల్లరి నరేష్‌ దుర్గమ్మకు పలువురి విరాళాలు డాక్టర్‌ జీవీ పూర్ణచందుకు లోకగురు పురస్కారం విద్యా ప్రమాణాల పెంపునకు కృషి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హీరో అల్లరి నరేష్‌ గురువారం దర్శించుకున్నారు. దుర్గాఘాట్‌, వీఐపీ ఘాట్‌తో పాటు కేఆర్‌ మార్కెట్‌, ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో గత నాలుగు రోజులుగా ఆయన సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న అల్లరి నరేష్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను నరేష్‌కు అందించారు. 1980లో విజయవాడలో దుర్గమ్మ రిక్షాలో ప్రయాణించి సినిమాకు వెళ్లిన కథ ఇతివృత్తంగా సినిమా నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. ఎన్టీఆర్‌ జిల్లా పెద ఓగిరాలకు చెందిన గుంటక దుర్గాప్రసాద్‌రెడ్డి, ఇంద్రజ దంపతులు అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,11,111, గుంటూరు ఎస్‌వీఎన్‌ కాలనీకి చెందిన పి.మధుబాబు, కుసుమకుమారి దంపతులు అన్న ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ, ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

విజయవాడ కల్చరల్‌: విజయవాడకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త, ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ జీవీ పూర్ణచందును 2026 ఏడాదికిగానూ లోకగురు పురస్కారానికి ఎంపిక చేసినట్లు వికాస విద్యార్థి వాహిని వ్యవస్థాపక అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని సర్వోత్తమ గ్రంథాలయంలో 29వ తేదీ సాయంత్రం పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వికాస వాహిని, గురుపూర్ణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయితోపాటు పలువురు సాహితీవేత్తలు, రచయితలు భాషా సేవకులు పాల్గొంటున్నారన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా వినూత్న కృషితో అధ్యయన పుస్తకాలను రూపొందిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్‌ లక్ష్మీశ.. విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్‌లో హిందీ స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ముఖ్యమైన అంశాలను సమగ్రంగా పొందుపరిచిన ఈ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డీఈవో ఎల్‌.చంద్రకళ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త రమేష్‌ బాబు, జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి కార్యదర్శి ఉమర్‌ అలీ, హిందీ రిసోర్స్‌ పర్సన్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement