సమన్వయంతో సమస్యల పరిష్కారం..
స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి సక్రమంగా సరఫరా చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం 1వ స్థాయీ సంఘం (ప్లానింగ్, ఆర్థికం), 7వ స్థాయీ సంఘం (పనులు) సమావేశాలు చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగాయి. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల మంజూరు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అనుమతులు పొందిన పనులను వెంటనే ప్రారంభించి, ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జెడ్పీటీసీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 24 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే సాధారణ సర్వసభ్య సమావేశాన్ని అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి..
విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొత్త సమావేశ మందిరం, చాంబర్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయని హారిక చెప్పారు. జిల్లా పరిషత్‌కు చెందిన భూముల్లో కొబ్బరి, కోకో, జీడిమామిడి, క్యాజూరినా వంటి వాణిజ్య పంటల సాగు ద్వారా ఆదాయం పెరగడంతో పాటు భూముల ఆక్రమణలను కూడా నివారించవచ్చన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా సంతృప్తి స్థాయిలో (సాచ్యురేషన్ మోడ్) తాగునీటి సరఫరా కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన తాగునీరు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
జెడ్పీ సీఈవో జె. అరుణ మాట్లాడుతూ స్థాయి సంఘ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను రూపొందించుకునే విధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థాయీ సంఘాల ఆమోదంతో తీసుకున్న అంశాలను రాబోయే సర్వసభ్య సమావేశంలో ఆమోదానికి ఉంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


