మూడు చక్రాల వాహనాల పంపిణీ
చిలకలపూడి(మచిలీపట్నం): సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు గర్వంగా బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో పాఠశాల విద్య – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టర్ బాలాజీ దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి వారికి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించామన్నారు. ఆ మేరకు జిల్లాలో 132 మందికి 212 బ్యాటరీ మూడు చక్రాల వాహనాలు, చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్లు, నడక కర్రలు తదితర రూ.15,63,218 విలువైన పరికరాలు కేంద్ర ప్రభుత్వం తరఫున అలింకో సంస్థ సహకారంతో అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిపొందిన దివ్యాంగులు తమకు మూడు చక్రాల వాహనాలు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి డీటీడబ్ల్యూ ఫణి ధూర్జటి, దివ్యాంగుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


