పాత పంచాయతీల వారీగానే ఫీల్డ్ అసిస్టెంట్లు నియామకాలు లేక ఉన్నవారిపై ఒత్తిడి ఉద్యోగ భద్రత కోసం ఏళ్లుగా పోరాటం జిల్లాలో 160 మంది ఎఫ్‌ఏలు
అరకొర జీతం..
తిర్యాణి: ఉపాధిహామీ పథకం స్థానంలో వీబీజీ రాం జీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పా రదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామ సభల్లో నే పనులు గుర్తిస్తున్నారు. అయితే పనుల గుర్తింపు, నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిభారం, అరకొర జీతంతో కుదేలవుతున్నా యి. కూలీలకు పనులు కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్న వీరు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. రెండు దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో చెమటోడుస్తు న్నా ఉద్యోగ భద్రత లేక అవస్థలు అవస్థలు పడుతున్నారు. ఓ వైపు ధరలు పెరుగుతుండగా వీరు మా త్రం కేవలం రూ.12 వేల జీతం సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అది కూడా నెలల తరబడి ఆలస్యంగా ఇస్తుండటంతో కుటుంబ పోషణ భారమవుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పోస్టులు ఖాళీగా ఉన్నా నియామకాలు చేపట్టకపోవడంతో ఒకరి పనులు మరొకరిపై పడి పనిభారంతో నలిగిపోతున్నారు.
విధుల్లో 160 మంది..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం కేవలం 160 మంది(పాత పంచాయతీల వారీగా) మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతీ పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అవసరం ఉన్నా నూతన నియామకాలు చేపట్టడం లేదు. ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పుడు వీబీజీ రామ్ జీ పథకం వరకు దాదాపు 20 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్టు పద్ధతిన విధులను నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు నేటికీ పదోన్నతులు లేవు. రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలతోపాటు ఇతర ఖర్చులు పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు కేవలం రూ.12 వేల వేతనం మాత్రమే చెల్లిస్తుండగా, అవి కూడా సక్రమంగా అందడం లేదు. వేతనాలు మూడు, నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు.
పనులు చేస్తున్న కూలీలు(ఫైల్)
కరువైన ఉద్యోగ భద్రత
2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశపడ్డారు. కానీ నేటికీ హామీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగ భద్రత లేక వచ్చిన అరకొర జీతంతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమను క్రమబద్ధీకరించి(రెగ్యులరైజ్) సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వేడుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో అనేక విధులు..
వీబీజీ రాం జీ పథకం క్షేత్రస్థాయి అమలులో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర అత్యంత కీలకం. పనులను గుర్తించడం నుంచి మొదలుకుని కూలీలను సమీకరించడం వరకు బాధ్యత ఎఫ్‌ఏలపైనే ఉంటుంది. వచ్చిన కూలీలకు సంబంధించిన మస్టర్ రోల్ నిర్వహణతోపాటు చేపడుతున్న పని ప్రదేశాన్ని పరిశీలించడం వంటి ముఖ్యమైన పనులు చేపడతారు. పని ప్రదేశంలో నీడ, తాగునీటి సదుపాయం కల్పించాలి. పని కావాలని కోరుతున్న కూలీలకు సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పని కల్పించడం, ఆ పనులకు సంబంధించిన వివిధ రకాల రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. అవే కాకుండా ఇతర అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షించాలి.


