చింతలమానెపల్లి/కౌటాల: కుష్ఠు రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కేంద్ర పరిశీలకుడు వీరా కుమార్ అన్నారు. జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమం కింద గురువారం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌లోని గంగాపూర్–బాబాపూర్ పీహెచ్‌సీతోపాటు కౌటాలలో పీహెచ్‌సీని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ జాన్‌బాబుతో కలిసి తనిఖీ చేశారు. కుష్ఠు రోగులకు చేస్తున్న పరీక్షలు, చికిత్స, ఎండీటీ మందుల లభ్యతపై ఆరా తీవారు. వారు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా శాశ్వతంగా నయం చేయవచ్చన్నారు. వ్యాధిగ్రస్తులు ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్తలు సర్వే చేపట్టాలని, ఉచిత చికిత్సపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వెంకటేశ్వరచారి, ఎం.శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా లెప్రసీ అధికారి సుజిత్, పీహెచ్‌సీల వైద్యాధికారుల రాజ్‌కుమార్, కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.


