రామకృష్ణాపూర్: చిన్నతనంలో అమెరికా నుంచి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు వచ్చినప్పుడు తాతయ్య చెప్పిన కథలు వింటూ, ఆయనతో కలిసి పల్లెల్లో, వ్యవసాయ పొలాల్లో తిరిగిన ఓ బాలుడు... కాలక్రమేణా అదే తాతయ్య అల్జీమర్స్ వ్యాధితో బాధపడటాన్ని గమనించాడు. ఆ అనుభవం అతనిలో ఓ ఆలోచనకు బీజం వేసింది. అల్జీమర్స్‌ను ముందుగానే గుర్తించగలిగితే? వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటే? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ పరిశోధన ప్రారంభించాడు. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్లెవ్యూ ప్రాంతానికి చెందిన హైస్కూల్ విద్యార్థి శ్రీహిత్ చెన్నారెడ్డి(16) 2026 గ్లోరియా బారన్ ప్రైజ్ ఫర్ యంగ్ హీరోస్‌కు ఎంపికయ్యాడు. ప్రజలు, సమాజం, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతున్న యువ నాయకులను ఈ అవార్డు గుర్తిస్తుంది. ఈ ఏడాది 25 మందిని ఎంపిక చేయగా, వారిలో 15 మంది టాప్ విజేతలకు ఒక్కొక్కరికి 10 వేల అమెరికన్ డాలర్ల నగదు పురస్కారం అందుతుంది.
తక్కువ ఖర్చుతో బహుభాషా ఏఐ..
శ్రీహిత్ రూపొందించిన " MConAI' తక్కువ ఖర్చుతో అల్జీమర్స్ వ్యాధిని ముందస్తుగా గుర్తించే బహుభాషా ఏఐ వ్యవస్థ. వ్యక్తులు మాట్లాడిన మాటలను టెక్స్‌ట్‌గా మార్చి, అందులోని సూక్ష్మమైన కాగ్నిటివ్–లింగ్విస్టిక్ బయోమార్కర్లను విశ్లేషిస్తుంది. దీని ఆధారంగా వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా, స్వల్పస్థాయి కాగ్నిటివ్ సమస్యలున్నాయా లేదా అల్జీమర్స్ అభివృద్ధి చెందుతున్న సంకేతాలున్నాయా అనేది గుర్తిస్తుంది. అన్ని భాషల్లో మాట్లాడే వ్యక్తులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. పరిశోధనలో ఇంగ్లిష్‌లో 87 శాతం, ఇతర భాషల్లో 83 శాతం ఖచ్చితత్వం సాధించినట్లు బారన్ ప్రైజ్ ప్రకటించింది. ఇంగ్లీష్‌కు మాత్రమే పరిమితమైన అనేక ఏఐ ఆధారిత డిమెన్షియా స్క్రీనింగ్ సాధనాలతో పోలిస్తే బహుభాషా విధానంలో MConAI ప్రత్యేకంగా నిలిచిందని అవార్డు సంస్థ పేర్కొంది.
ఎంఆర్‌ఐ స్థాయి ఫలితాలతో పోలిక
శ్రీహిత్ పరిశోధనలో వచ్చిన ఫలితాలు ఎంఆర్‌ఐ స్కాన్ల వంటి ఖరీదైన క్లినికల్ డిటెక్షన్ పద్ధతుల ఖచ్చితత్వంతో పోల్చదగినవిగా ఉన్నట్లు బారన్ ప్రైజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో ప్రజ లకు అందుబాటులో ఉండే విధంగా ఈ విఽ దానాన్ని మరింత అభివృద్ధి చేయగలిగితే వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లోనూ అల్జీమర్స్ స్క్రీనింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు.
అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన
శ్రీహిత్ తన పరిశోధనను ప్రతిష్టాత్మక అల్జీమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ న్యూరో సైన్స్ నెక్స్‌ట్ 2026 కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. టోక్యోలో జరిగిన ఏసీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్‌లోనూ ప్రాజెక్టును వివరించారు. ఆయన పరిశోధన ఏసీఎం డిజిటల్ లైబ్రరీ, ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్‌లో ప్రచురితమైంది. ప్రస్తుతం స్టోనీ బ్రూక్ యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇన్ఫార్మేటిక్స్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీతో కలిసి ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ఏఐ పరిశోధనను కొనసాగిస్తున్నట్లు బారన్ ప్రైజ్ తెలిపింది.
రామకృష్ణాపూర్‌తో ప్రత్యేక అనుబంధం
శ్రీహిత్ కుటుంబానికి రామకృష్ణాపూర్‌తో మూడు తరాల అనుబంధం ఉంది. ఆయన తల్లి ప్రసన్న ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. తాతయ్య సింగరేణిలో ఏ1 కాంట్రాక్టర్‌గా పనిచేశాడు.
తాత అనారోగ్యమే
పరిశోధనకు స్ఫూర్తి..
అల్జీమర్స్‌తో బాధపడుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన తర్వాతే ఈ పరిశోధన ప్రారంభించా. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా ప్రజలు అల్జీమర్స్ బారిన పడుతున్న విషయం తెలిసింది. ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం అందించాలనే పట్టుదల మరింత పెరిగింది. పరిశోధన కొనసాగించే కొద్దీ నా పట్టుదల, ప్రత్యేకమైన ఆలోచన విధానం ఒక్కో అంశాన్ని మరో అంశంతో అనుసంధానించేందుకు సహాయపడ్డాయి. చివరకు నా ప్రాజెక్టు విజయవంతమైంది. – శ్రీహిత్


