కాసిపేట: పేలుళ్లతో ఇళ్లు కూలుతున్నాయని, న్యాయం చేయాలని మండలంలోని సోమగూడెం(కె), బెల్లంపల్లి మండలం సోమగూడెం(బి) గ్రామపంచాయతీల ప్రజలు బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌ను వేడుకున్నారు. బుధవారం ఆయన సోమగూడెం, ట్యాంక్‌బస్తీ గ్రామాల్లో మందమర్రి జీఏం రాధాకృష్ణతో కలిసి పర్యటించారు. ఓపెన్‌కాస్టు బ్లాస్టింగ్‌లతో పగులు తేలుతున్న ఇళ్లను పరిశీలించారు. ఓసీ వల్ల కలిగే నష్టాలను స్థానికులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. జీఏం రాధాకృష్ణ మాట్లాడుతూ ఓసీ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి సింగరేణి తరఫున సహకారం అందిస్తున్నామని, పేలుళ్ల విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసీ పీవో రాంబాబు, సోమగూడెం(కె) సర్పంచ్ కున్సోత్ చైతన్య, సోమగూడెం(బి) సర్పంచ్ పొన్నాల మౌనిక, మాజీ సర్పంచ్ సఫాట్ శంకర్, ఉపసర్పంచ్‌లు మల్యాల స్రవంతి, బూరుగుపల్లి రమేష్, సీపీఐ(ఏఎం) జిల్లా కన్వీనర్ సంకె రవి, మాజీ ఉపసర్పంచ్‌లు కనుకుల రాకేష్, కుక్క రాంచందర్, నాయకులు తోడేటి ప్రశాంత్, తేండ్రా శ్యాం, వెంకటలక్ష్మి, శ్రీనివాస్, వెంకటస్వామి, మధు, రమేష్ పాల్గొన్నారు.


