రెండు, మూడ్రోజులకే నిండు నూరేళ్లు రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ పేలి ప్రమాదం ఊపిరాడక ముగ్గురు పసికందులు మృతి ప్రమాద సమయంలో వార్డులో 27మంది చిన్నారులు హుటాహుటిన రిమ్స్‌కు కలెక్టర్, ఎస్పీ
రిమ్స్‌కు చేరుకున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
తల్లిడిల్లిన గుండెలు
నెలలు నిండక ముందే లోకం చేరిన ఆ పసికందులపై విధి కన్నెర్రజేసింది. ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదరూపంలో వారిని కబలించింది. పుట్టి వారం గడవకముందే ఊపిరాడకుండా చేసి తిరిగిరాని లోకాలకు చేర్చింది. పేరు పెట్టకముందే పేగుబంధాన్ని తెంచేసింది. పురిటి నొప్పులు సైతం వీడని ఆ తల్లులకు గుండె కోత.. బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
ఆదిలాబాద్‌టౌన్/కై లాస్‌నగర్: నవమాసాలు పూర్తి కాకుండా పుట్టిన కొందరు, చిన్నపాటి రుగ్మతలతో జన్మించిన మరికొందరిని రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్మర్‌లో ఉంచారు. వీరి పాలిట ఏసీ మృత్యుపాశంగా మారింది. అప్పటి వరకు తమ చిన్నారులను చూసి మురిసిపోయిన వారంతా అర్ధరాత్రి అకస్మాత్తుగా జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో హతాశులయ్యారు. దట్టమైన పొగతో ముగ్గురు పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదా నికి గురైన చిన్నారులను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పెను ప్రమాదం తప్పినట్లయింది.
ముగ్గురు చిన్నారుల మృత్యువాత
ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సలీంఖాన్(ఫీర్‌ఖాన్), సబాఖానంకు శుక్రవారం పాప జన్మించింది. ఏడు నెలలకే పుట్టిన పాపను ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఉంచారు. ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరకు చెందిన షేకుబాయి– కుమ్ర దినేష్ దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ఎనిమిది నెలలకే బిడ్డ పుట్టడంతో ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఉంచారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తెల్లవారుజామున 4.35 గంటలకు చిన్నారి మృతి చెందింది. అలాగే ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన సబా సమ్రిన్–తౌఫిక్ దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. బరువు 1100 గ్రాములు ఉండడంతో ఎస్‌ఎన్‌సీయూలో ఉంచా రు. పొగతో ఊపిరాడక చిన్నారి అస్వస్థతకు గురైంది. మొదట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి త రలించగా, మెరుగైన వైద్యం కోసం నిర్మల్, అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. అక్కడికి చేరుకునే సమయంలోనే చిన్నారి మృతిచెందింది.
ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు..
అస్వస్థతకు గురైన చిన్నారులను వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ చిల్డ్రన్స్ ఆస్పత్రులకు తరలించా రు. పట్టణంలోని ఇషా, కేర్, సురక్షా, లక్ష్మినర్సింహా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ మంగళవారం వేకువజామున 4 గంటల వరకు అక్కడే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రతి చిన్నారికి సంబంధించి ప్రత్యేక చొరవ చూపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ప్రమాదం జరిగినప్పటి నుంచి చిన్నారులను తరలించే వరకు దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. తెల్లవారుజామున ఆయా ఆస్పత్రులకు వెళ్లి పసికందుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
మరో ఇద్దరు శిశువుల పరిస్థితి విషమం
ప్రమాదంలో గాయపడ్డ శిశువుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని విఘ్నేశ్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పాప 900 గ్రాముల బరువు ఉందని పేర్కొన్నారు. ఈ శిశువు మహారాష్ట్రలోని పాఠన్‌కు చెందినదిగా చెబుతున్నారు. అలాగే రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి సైతం విషమంగానే ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. మరో 22 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. వీరంతా జిల్లా కేంద్రంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
షార్ట్ సర్క్యూట్‌లో దెబ్బతిన్న వైద్య పరికరాలు
అసలేం జరిగిందంటే ..
ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో 27 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి 11.40 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ విభాగంలోని రిసెప్షన్ వద్ద ఉన్న ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అందులోని గ్యాస్ లీకై దట్టమైన పొగ అలుముకుంది. అక్కడున్న వైద్యులు, సిబ్బంది భయంతో పరుగు తీశారు. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయం. తల్లిదండ్రులు, కుటుంబీకులు కొంతమంది సిబ్బంది లోపలకు వెళ్లి చిన్నారులను ఒక్కొక్కరిని బయటకు తీసుకువచ్చారు. తల్లిదండ్రుల రోదనలు, చిన్నారుల ఏడుపులతో వార్డు దద్దరిల్లింది. మిగతా వార్డులో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చిన్నారులను కాపాడే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగ కారణంగా పసికందుల శరీరమంతా మసిబారిపోయింది. చిన్నారులను బయటకు తీసుకువచ్చే సమయంలో కొందరు ఊపరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ వైద్యుడు, కొంతమంది సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి నవజాత శిశువులను కాపాడారు. అయినప్పటికీ ఓ శిశువు పొగతో ఊపిరాడక తనువు చాలించింది. ప్రమాదతీవ్రత పెరుగవద్దనే ఉద్దేశంతో ఆ వార్డులో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఇంక్యుబేటర్లు పనిచేయడం ఆగిపోయాయి. వెంటిలేటర్లపై ఉన్న నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా అదే సమయంలో వార్డుల సందర్శనకు వచ్చిన డైరెక్టర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తాను సైతం పొగలోనూ లోపలకు వెళ్లి చిన్నారులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే విషయాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు సైతం 15 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు.


