పెద్దవాగు ప్రాంతంలో పకడ్బందీ ఏర్పాట్లు పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నేడు, రేపు, ఎల్లుండి కొనసాగనున్న నిమజ్జనాలు
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్/కౌటాల: జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజులపాటు గణేశ్ నిమజ్జనోత్సవాలు కొనసాగనున్నాయి. ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 1191 వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. రెండోరోజు నుంచే విగ్రహ నిమజ్జనాలు ప్రారంభించారు. ఇప్పటికే 200 వరకు గణనాథుల నిమజ్జనం పూర్తి చేశారు. 10వ రోజు బుధవారం 379, 11వ రోజు గురువారం 188, 12వ రోజు శుక్రవారం 444 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. మొత్తంగా ఆసిఫాబాద్‌లో 464, కాగజ్‌నగర్ డివిజన్‌లో 672 విగ్రహాలు నిమజ్జనానికి మిగిలి ఉన్నాయి. 400 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షించడంతోపాటు బోట్లు, డీడీఆర్‌ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.
భద్రత, అప్రమత్తత ముఖ్యం..
కాగజ్‌నగర్‌లో పెద్దవాగు, ఆసిఫాబాద్‌లో పెద్దవాగు ప్రాంతంలో నిమజ్జనోత్సవం కొనసాగుతుండగా, కౌటాలలో వార్దా, ప్రాణహిత నదులు, సిర్పూర్(టి)లో పెన్‌గంగ, బెజ్జూర్, పెంచికల్‌పేట్‌లోని ప్రాణహిత నది, దహెగాంలోని పెద్దవాగు నదుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో రెండేళ్ల క్రితం కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగులో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రేన్ సాయంతో వినాయకుడిని ఎక్కించే క్రమంలో టైరు కిందపడి ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. శోభాయాత్రలో ప్రధానంగా వాహన డ్రైవర్లు అనుభవజ్ఞులైతే ప్రమాదాలను నివారించవచ్చు. విద్యత్ తీగలు, రోడ్లు, వాహనాలు, ప్రజలను పరిశీలించడం ముఖ్యం. డీజేలకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. మద్యం షాపులు మూసివేయనున్నారు.
కాగజ్‌నగర్‌లో 25న..
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఈసారి 116 వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ నెల 25న శుక్రవారం వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు హిందూ ఉత్సవ సమితి, అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక శోభాయాత్ర పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, తిరందాజ్ టాకీస్, రాజీవ్ గాంధీ చౌరస్తా, లారీ చౌరస్తా, ఈఎస్‌ఐ మూలమలుపు, తెలంగాణ తల్లి చౌరస్తా, పెట్రోల్ పంప్ మీదుగా కొ నసాగి పెద్దవాగు నిమజ్జన ప్రాంతానికి చేరుకోనుంది. పెద్దవాగులో నిమజ్జనం నిర్వహించే ప్రాంతంలో ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది భారీ వర్షాలతో వాగు నీటితో కళకళలాడగా ఈసారి తక్కువగా ఉంది. పెద్దవాగు నీటిప్రవాహాన్ని నిమజ్జన ప్రాంతానికి మళ్లించేందు కు ఐదు ఫీట్ల లోతుతో కాలువను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. క్రైన్ వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. దిగువన ఇసుక బస్తాలు నింపి వేశారు. మరోవైపు నిమజ్జన ప్రాంతానికి వెళ్లే పట్టణ రహదారులు గుంతలమయంగా ఉండడంతో వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది.
కాగజ్‌నగర్ పెద్దవాగులో వేసిన ఇసుక బస్తాలు
ఆసిఫాబాద్ పెద్దవాగు ప్రాంతంలో ఏర్పాట్లు
జిల్లా వివరాలు
పోలీస్‌స్టేషన్ పరిధి మొత్తం నిమజ్జనం
విగ్రహాలు చేయాల్సినవి
ఆసిఫాబాద్ 112 107
వాంకిడి 88 87
కెరమెరి 54 50
జైనూర్ 45 31
సిర్పూర్–యు 21 12
లింగాపూర్ 40 31
రెబ్బెన 99 99
తిర్యాణి 51 47
కాగజ్‌నగర్‌టౌన్ 117 115
కాగజ్‌నగర్ రూరల్ 60 60
దహెగాం 77 75
ఈస్‌గాం 105 105
పెంచికల్‌పేట్ 52 50
సిర్పూర్–టి 61 60
కౌటాల 80 80
చింతలమానెపల్లి 74 73
బెజ్జూర్ 55 54
మొత్తం 1191 1136


