ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారు. ప్రమాదంలో చిన్నారులు మృతిచెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల పరిశీలనకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జిల్లాకు పంపించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ప్రత్యేక హెలి క్యాప్టర్‌లో రిమ్స్‌కు చేరుకున్నారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టీనా జడ్. చోంగ్తూ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రితో కలిసి వచ్చారు. రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూతో పాటు పలు వార్డులను పరిశీలించారు. దాదాపు గంటకు పైగా పలువురు రోగులతో మాట్లాడి సంఘటన తీరు, వైద్య సేవలపై ఆరా తీశారు. అనంత రం డైరెక్టర్ చాంబర్‌లో ఆస్పత్రి సేవల్లోని లోపాలు, అవసరమైన వసతులు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్‌స్ట్రక్చర్ ఆడిట్‌లను నిర్వహించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వారం రోజుల్లో అందే నివేదిక ఆధారంగా తగు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 150 పడకలతో కూడిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. వంద రోజుల్లో రిమ్స్ రూపురేఖలు మార్చుతామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాకుండా చర్యలు చేపడతా మని తెలిపారు. తలసేమియా, సికిల్‌సెల్, ఎనిమియా, హిమోఫీలియా వంటి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేలా రిమ్స్‌లో ప్రత్యేకంగా హెమటాలజీ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. మంత్రి వెంట డీఎంఈ పి.వాణి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరందు, డీఎంహెచ్‌వో సాధన, మార్కెట్, లైబ్రెరీ, మున్సిపల్ చైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి, నర్సయ్య, అనూష, కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.


