ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో సేవలు మెరుగవుతున్నాయి. గతంలో నామమాత్రంగా రెఫరల్ కేంద్రంగా మాత్రమే ఉన్న ఈ ఆస్పత్రి ఇప్పుడు పేదలకు పెద్ద దిక్కుగా మారుతోంది. ఒకప్పుడు గర్భిణులు వస్తే కేవలం సాధారణ ప్రసవాలు మాత్రమే చేయగా, సిజేరియన్ అవసరమైన వారు కాగజ్‌నగర్, మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేవారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 వేల వరకు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇటీవల అత్యవసర పరిస్థితుల్లోనూ జిల్లా ఆస్పత్రిలో సిజేరియన్ కాన్పులు నిర్వహిస్తున్నారు. వైద్యబృందం విజయవంతంగా ఆపరేషన్లు చేస్తూ పేదలకు కొండంత భరోసా కల్పిస్తోంది.
డిప్యూటేషన్‌పై వైద్యులు
జిల్లాలో అత్యధికంగా ఆదివాసీ గిరిజన, నిరుపేద కుటుంబాలే ఉన్నాయి. గతంలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లు జరిగేవి కావు. దీంతో కాగజ్‌నగర్ నుంచి ఒక గైనకాలజిస్టు, ఒక అనస్తీషియా వైద్యుడిని జిల్లా ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై పంపించారు. ప్రస్తుతం ఇద్దరు గైనిక్ వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రసవాలను పర్యవేక్షిస్తున్నారు. సిజేరియన్‌కు కీలకమైన అనస్తీషియా డాక్టర్ అందుబాటులోకి రావడంతో ఆపరేషన్లు సాధ్యమవుతున్నాయి. పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా చూసుకునేందుకు పీడియాట్రిక్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ల్యాబ్, బ్లడ్ బ్యాంక్ సేవలు కూడా మెరుగుపడ్డాయి. గైనకాలజిస్టులు నందిని, దివ్య, అనస్తీషియా వైద్యులు కావ్య, ప్రవీణ్, పీడియాట్రిక్ వైద్యురాలు ప్రియాంకతో కూడిన వైద్యబృందం అత్యవసర పరిస్థితుల్లో సర్జరీలు చేస్తున్నారు.
ఆసిఫాబాద్‌కు చెందిన గర్భిణి రమ్య ఈ నెల 8న పురిటి నొప్పులతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు సాధారణ కాన్పు కోసం చికిత్స ప్రారంభించారు. పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండడంతో వైద్యబృందం సిజేరియన్ చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగజ్‌నగర్‌కు చెందిన ఓ గర్భిణి ఈ నెల 19న రాత్రి ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ అడ్డం తిరగడంతోపాటు ఉమ్మనీరు తక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గైనకాలజిస్టులు నందిని, దివ్య, అనస్తీషియా వైద్యులు కావ్య, ప్రవీణ్, పీడియాట్రిషియన్ ప్రియాంక అత్యవసరంగా సిజేరియన్ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
ప్రసవాలు ఇలా..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి మెటర్నిటీ విభాగంలో ఆరు నెలల్లో 3,646 మంది గర్భిణులు రాగా 1,577 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. మొత్తం 183 కాన్పులు జరిగాయి. ఇందులో 163 సాధారణ కాన్పులు కాగా 20 సిజేరియన్లు నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య నెలకు 20 నుంచి 30 ప్రసవాలు మాత్రమే జరిగేవి. గైనిక్, అనస్తీషియా వైద్యులు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన అనంతరం ఆగస్టులో ప్రసవాల సంఖ్య 45కు చేరింది. వీటిలో 41 సాధారణ కాన్పులు, నాలుగు సిజేరియన్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్‌లో మొదటి 20 రోజుల్లోనే ఏకంగా తొమ్మిది సిజేరియన్ ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో సిజేరియన్ ఆపరేషన్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. ఉచిత మందులు, స్కానింగ్, పోషకాహారం, కిట్లు అందుతున్నాయి.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి
సేవలు మెరుగు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో సేవలు మెరుగుపడ్డాయి. గత ఆరు నెలల్లో 20 సిజేరియన్ ఆపరేషన్లు చేశాం. ఆస్పత్రి స్కానింగ్ సెంటర్‌లో రేడియాలజిస్టు అందుబాటులో ఉండడంతో ప్రతిరోజూ 70 స్కానింగ్‌లు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతిరోజూ 40 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
– డాక్టర్ కిరణ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్


