కెరమెరి: విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తరగతి గది బోధనలో నూతన మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో 2026– 27 విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22 నుంచి 29 వరకు ఈ సమావేశాలకు ఉపాధ్యాయులు హాజరు కానున్నారు. లెస్సన్ ప్లాన్‌ల అమలు, టీఎల్‌ఎంల తయారీ, పదో తరగతి వార్షిక పరీక్షల ఉత్తమ ఫలితాల కోసం యాక్షన్ ప్లాన్ తదితర అంశాలను ఇందులో చర్చించనున్నారు.
దశల వారీగా నిర్వహణ
జిల్లాలో ఉన్నత పాఠశాలలు 60, ప్రాథమికోన్నత 100, ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, 8100 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే కాంప్లెక్స్ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు కొనసాగుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులను రెండు విభాగాలు విభజించారు. ఈ నెల 22న 50శాతం మందికి, 24న మిగిలిన వారికి సమావేశం ఉంటుంది. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు 26న తెలుగు, ఉర్దూ, గణితం, వ్యాయామ ఉపాధ్యాయులకు, 28న హిందీ, జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం, 29న ఇంగ్లిష్, సాంఘిక శాష్త్రం టీచర్లకు సమావేశాలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు ఉదయం సమావేశాలకు రాగానే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ ద్వారా చెక్‌ఇన్ చేయాలి, సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత చెక్ అవుట్ చేయాలి. మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదైన ఉపాధ్యాయులకు మాత్రమే ఆన్‌లైన్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. వందశాతం టీచర్ల హాజరు బాధ్యత కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలదే అని అధికారులు స్పష్టం చేశారు. సమావేశం ముగిసిన వెంటనే మినిట్స్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రీ ప్రైమరీకి కొత్త కాంప్లెక్స్‌లు
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రీప్రై మరీ ఇన్‌స్ట్రక్టర్లకు కూడా తొలిసారి సమావేశాలు నిర్వహించనున్నారు. సంఖ్య ఆధారంగా ప్రత్యేక కేంద్రాలను గుర్తించనున్నారు. సబ్జెక్టు కాంప్లెక్స్ లేని ఉన్నత పాఠశాలలను ప్రీప్రైమరీ కాంప్లెక్స్ కేంద్రాలుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇన్‌స్ట్రక్టర్లు సమావేశానికి వెళ్లిన రోజున ఆయా పాఠశాలలు మూతపడకుండా పీఎస్ హెచ్‌ఎంలు, ఒక ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి. కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేయాలి. తొలిసారి ప్రీప్రైమరీ బోధకులను ప్రత్యేక కాంప్లెక్స్ పరిధిలోకి తీసుకురావడం, ప్రాథమిక స్థాయిలోనే లర్నింగ్ కార్నర్‌లు, స్టోరీ కార్డులు, క్యూఆర్ కోడ్‌ల వినియోగం అలవాటు చేయడంతో ఫౌండేషన్ లర్నింగ్ బలపడుతుంది.


