ఆసిఫాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంలో పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటి పారుదల శాఖ కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం అందించాలన్నారు. కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించారు. భూ సేకరణ, పునరావాస కల్పనలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తిరుపతి, భద్రయ్య, కేవీ రమణ, వేణుగోపాల్, సత్యనారాయణ పాల్గొన్నారు.


